YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

పెరిగిన ఆర్టీసీ ఆదాయం

పెరిగిన ఆర్టీసీ ఆదాయం

హైదరాబాద్, నవంబర్ 30,
ఆదాయం పెంచడంలో ఆర్టీసీ కార్మికులు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. వారి కష్టానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ దూకుడు కూడా తోడవడంతో ఆర్టీసీ బస్సు ఆదాయంలో వేగంగా దూసుకెళుతోంది. ప్రస్తుతం పెండ్లిండ్ల సీజన్‌ కావడంతో గతంలో కంటే రోజువారీ ఆదాయం రూ.12 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు పెరిగింది. సజ్జనార్‌ ఎమ్‌డీగా వచ్చాక ఆర్టీసీ కార్మికులకు వారి జీతాలు వారికి ఒకటో తేదీకే రావడం మినహా, రావల్సిన పాత బకాయిలు ఏవీ ఇప్పటి వరకు చేతికందలేదు. 2015 తర్వాత వారికి ఫిట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. రెండు ఫిట్‌మెంట్లు రావల్సి ఉంటే, యాజమాన్యం, ప్రభుత్వం వాటిపై కనీసం దృష్టికూడా పెట్టలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులను మాత్రం పట్టించుకోలేదు. పైగా 2019 జులై నుంచి వారికి రావల్సిన కరువు భత్యం (డీఏ) కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఐదు డీఏలు బకాయి ఉన్నాయి. 2019 జులైలో 5.5 శాతం, 2020 జనవరిలో 5.4 శాతం, అదే ఏడాది జులైలో 4.7 శాతం, 2021 జనవరిలో 3.4 శాతం, అదే ఏడాది జులైలో 3 శాతం చొప్పున మొత్తంగా 23శాతం డీఏలు ఆర్టీసీ కార్మికులకు చెల్లిం చాల్సి ఉంది. సంస్థ ఆదాయం పెరిగిన నేపథ్యంలో కనీసం డీఏలు అయినా చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. రావల్సిన రెండు ఫిట్‌మెంట్ల ప్రస్తావనే ప్రస్తుతం లేదు. కార్మిక సంఘాలు అడపాదడపా అడుగుతున్నా, యాజమాన్యం, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నాయి. అలాగే ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌)లోనే అంతర్భాగంగా ఉండే ఎంప్లాయీస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీం (ఇడ్లీస్‌) కూడా నిలిచిపోయింది. ఈ స్కీం కింద మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రూ.2.50 లక్షల నుంచి గరిష్టంగా రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ లభిస్తుంది. డెత్‌ సర్టిఫికెట్‌ సమర్పించిన 48 గంటల్లో వారికి ఇన్సూరెన్స్‌ సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. 2019-20 నుంచి ఈ స్కీం అమలు కావట్లేదు. యాజమాన్యం పీఎఫ్‌ సొమ్మును సకాలంలో చెల్లించకపోవడమే దీనికి కారణం! దాదాపు 650 మంది ఆర్టీసీ కార్మికులు ఈ మధ్యకాలంలో మరణించారు. వారి కుటుంబసభ్యులు ఆ సొమ్ముకోసం చెప్పులరిగేలా డిపో మేనేజర్ల చుట్టూ తిరుగుతున్నారు. హెడ్‌ ఆఫీస్‌లో నిర్ణయం తీసుకోనిదే తామేమీ చేయలేమని డిపో మేనేజర్లు చేతులెత్తేస్తున్నారు. ఇటీవల మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు హైదరాబాద్‌ బస్‌భవన్‌కు వచ్చి ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా, ఇప్పటికీ మోక్షం లభించలేదు. ఇప్పటికైనా కార్మికులకు రావల్సిన బకాయిలు, చెల్లించాల్సిన ప్రయోజనాలు ఇస్తే, వారు మరింత ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారని కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు.
వినూత్న ప్రచారంలో సజ్జనార్
ఎస్పీగా పనిచేసినా.., పోలీస్‌ కమిషనర్‌గా డ్యూటీ చేసినా.. ఓ సంస్థకు ఎండీగా పనిచేసినా ఆయన రూటే సెపరేటు. ఆయనే సజ్జనార్‌. ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్‌ చూపిస్తారు ఐపీఎస్‌ ఆఫీసర్ వీసీ సజ్జనార్. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆర్టీసీ చక్రాలను ప్రగతి పథంలో నడిపేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి భద్రత కల్పించేందుకు వినూత్న రీతిలో ముందుకెళుతున్నారు ఆర్టీసీ ఎండీ. తాజాగా తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు సజ్జనార్. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం సురక్షితమని వినూత్నంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఎండీ.ఆర్టీసీ ఎండీగా గత సెప్టెంబరు 3న బాధ్యతలు చేపట్టారు వీసీ సజ్జనార్‌. వెంటనే సంస్థ పురోగతిపై దృష్టిసారించి, సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇలా 81 రోజుల వ్యవధిలో 370 ఫిర్యాదులు రాగా, వాటిలో 364 పరిష్కరించారు సజ్జనార్. ప్రజలు, విద్యార్థులు, మహిళల నుంచి వచ్చిన వినతులను ప్రత్యేకంగా పరిశీలించి, 151 కొత్త సర్వీసులను ప్రారంభించారు.కొత్తవి, పునరుద్ధరించినవి కలిపి మొత్తం 510 సర్వీసులు మొదలయ్యాయి. అంతే కాకుండా పెళ్లిళ్లకు, శబరిమల యాత్రకు.. ఇలా అన్నింటికి బస్సులను రెంట్‌కు ఇస్తోంది ఆర్టీసీ. సంస్థ ప్రగతి కోసం ఎండీ, అధికారులు, ఉద్యోగులు చూపుతున్న నిబద్ధతను అభినందిస్తున్నారు ప్రజలు.@tsrtcmdoffice VC Sajjanar కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు మరియు సపరివార సమేతంగా బస్సులో ప్రయాణం చేసి @TSRTCHQ బస్సులో ప్రయాణం సురక్షితం,సుఖమయం మరియు శుభప్రదం అని ప్రయాణికులకు భరోసా కల్పిస్తున్న వైనం.

Related Posts