అమరావతి
ప్రతి ఇంట పేదరికం పోవాలి, మన తలరాతలు మారాలన్న.. ప్రతివర్గం పెద్ద చదువులు చదువుకోవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో చదువుకునేవారి సంఖ్య బాగా పెరగాలన్న సీఎం.. బాగా చదువుకుంటేనే తలరాతలు మారుతాయన్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు.. దాని నుంచి బయటపడాలన్నారు. నూటికి నూరుశాతం అక్షరాస్యత కానేకాదు, పిల్లలను వందశాతం గ్రాడ్యయేట్లగా నిలబెట్టాలన్నది మన లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నామన్న జగన్.. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తున్న ఘనత ఒక్క వైసీపీకే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి.
జగనన్న విద్యా దీవెన పథకం అమలులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. జగనన్న విద్యా దీవెన దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క పూర్తి ఫీజు రియింబర్స్మెంటే కాక, గత ప్రభుత్వ బకాయిలు రూ.1778 కోట్లతో కలిపి రూ.6259 కోట్లు చెల్లించామని సీఎం చెప్పారు. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే పేద విద్యార్దులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే (మూడు నెలలు) విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తున్నామని వెల్లడించారు, తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా… తల్లులు ప్రతీ మూడు నెలలకోసారి కాలేజీలకు నేరుగా వెళ్లి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీలలో వసతులు పరిశీలించి లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారన్నారు. కాలేజీలలో జవాబుదారీతనం, కాలేజీల స్ధితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతాయని సీఎం తెలిపారు. అయితే, జగనన్న విద్యా దీవెన పథకం కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఉన్నత విద్య చదివే అవకాశం, అందరికీ వర్తింపు, తద్వారా అన్ని విధాలుగా అయా కుటుంబాలు స్ధిరపడనున్నట్లు సీఎం తెలిపారు.