విజయవాడ, డిసెంబర్ 1,
ఏపీలో సినిమా టిక్కెట్ల అంశంపై లొల్లి నడుస్తున్న విషయం తెలిసిందే. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వమే సినిమా టిక్కెట్లు అమ్మడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పైగా రాష్ట్రంలో ఇంకా ప్రజలు ఏ సమస్య వల్ల ఇబ్బందులు పడటం లేదన్నట్లుగా..కేవలం సినిమా టిక్కెట్ల రేట్లు ఎక్కువగా ఉండటం వల్లే ప్రజలు తెగ బాధలు పడిపోతున్నట్లుగా జగన్ ప్రభుత్వం…సినిమా టిక్కెట్ల రేట్లని అదుపు చేయడానికి…ప్రభుత్వమే టిక్కెట్లని అమ్మే బాధ్యత తీసుకుంది. అలాగే బెనిఫిట్ షోలకు అనుమతి లేదని..నాలుగు షోలు మాత్రమే నడపాలని, అదే విధంగా సినిమా టిక్కెట్ల ధరలు ఒకే విధంగా అమలు చేయాలని డిసైడ్ అయింది. ఇక ఈ అంశంపై ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పైన పునరాలోచన చేయాలంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు. అటు నిర్మాత సురేష్ బాబు సైతం.. .నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేసారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సైతం అన్ని సినిమాలకూ ఒకే టికెట్ రేట్ పెట్టడం సరికాదని, దానివల్ల పెద్ద సినిమాలు నష్టపోతాయని, ప్రభుత్వం తమ నిర్ణయం గురించి మరోసారి పునరాలోచించాలని కోరారు. బాలయ్య సైతం సినిమాలు బాగా నడిచేలా ప్రభుత్వాలు సహకరించలాని కోరారు. అంటే అందరూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగానే ఉన్నారు. సినిమా అంటే ఎవరైనా ఇష్టపడి చూస్తారని, అది వారి ఇష్టమని అలాంటప్పుడు రేట్లు అనేవి అంత ఎఫెక్ట్ అవ్వవని అంతా అంటున్నారు. కానీ జగన్ ప్రభుత్వం ప్రజలపై మిగతా అంశాలపై పన్నుల భారం పెంచిందని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇసుక, మద్యం, కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరిగాయని, మరి వీటిపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదని అందరు హీరోల ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే సినిమా టిక్కెట్లు, షోల విషయంలో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే అందరి హీరోల ఫ్యాన్స్ యాంటీ అయ్యేలా ఉన్నారు. మరి దీనిపై జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.