కడప, డిసెంబర్ 1,
అన్నమయ్య డ్యాం కట్ట తెగిపోవడంతో జల ప్రళయం జరిగి 11 రోజులు అవుతున్నా విషాదఛాయలు దీని పరిధిలోని గ్రామాలను నేటికీ వదలలేదు. పులపత్తూరు తోగురుపేట రామచంద్రపురం, మందపల్లిలలో భారీ వర్షాలు పడ్డాయి. అధికారులు ప్రణాళికతో వ్యవహరించి ఉంచి సరైన సమయంలో అన్నమయ్య గేట్లు ఎత్తి ఉంటే ఇలాంటి ఉపద్రవాన్ని చూడాల్సి వచ్చేది కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఉపద్రవం జరగకుండా చివరి వరకు తమ స్థాయిలో ముమ్మర ప్రయత్నం చేశామని, అయినా, ఫలితం లేకపోయిందని అంటున్నారు. నదీ పరీవాహక ప్రాంతంలో వరదల్లో బాధితులకు చెందిన సుమారు వంద ఇల్లు నేలమట్టం కాగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇళ్లల్లోకి చేరిన వరద నీరు విలువైన వస్తువులను సైతం లాక్కొనివెళ్లి ప్రవాహంలో కలిసేసింది. కొంతమంది కట్టుబట్టలతో మిగిలారు. బీరువాలో దాచుకున్న విలువైన పత్రాలు, బంగారు, నగదు నీటి పాలయ్యాయి. వరద బీభత్సం వారిని కోలుకోలేని దెబ్బతీసింది. రాజంపేట మండలం పేటపులపుత్తూరు, తోగురుపేట, మందపల్లి, రామచంద్రపురంలలో ఇళ్ల్లు నేలమట్టమైన బాధితులు ప్రస్తుతం గుడిసెలు, డేరాలు వేసుకొని తమ ఇళ్ల శిథిలాల వద్ద జీవనం సాగిస్తున్నారు. తమకు యుద్ధప్రాదికతన పునరావాసం కల్పించాలని బాధితులు కోరుతున్నారు. డ్యాంకు గండిపడడంతో ఈ గ్రామాలకు చెందిన 24 మంది మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెంది తొమ్మిది మంది ఉన్నారు. గల్లంతైన మరో 15 మంది ఆచూకీ నేటికీ తెలియకపోవడంతో ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి. ఆ నాలుగు పల్లెల్లో నేడు ఎటు చూసినా బాధితుల కన్నీటి వేదనలు, హృదయ విదారక దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. తుపాను నేపథ్యంలో మళ్లీ ఆదివారం నుండి వర్షాలు కురుస్తుండడంతో వారిలో మళ్లీ తీవ్ర ఆందోళన మొదలైంది.