విజయవాడ, డిసెంబర్ 1,
ప్రశాంత్ కిషోర్ ఇంకా రంగంలోకి దిగలేదు. నవంబరు నుంచి పీకే టీం రంగంలోకి దిగుతుందని జగన్ స్వయంగా మంత్రివర్గ సమావేశంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయన్న చర్చ జరుగుతుంది. గతంలో పార్టీ అధికారంలోకి లేకపోవడం, జగన్ చరిష్మా ఇవన్నీ కలసి వచ్చాయి. దీనికి తోడు ఎక్కువ మంది నియోజకవర్గాలకు కొత్త నేతలు కనపడటం వల్ల కూడా వైసీపీలో జనం కనెక్ట్ అయ్యారు. .. కానీ ఈసారి వారే మళ్లీ బరిలోకి దిగబోతున్నారు. పెద్దయెత్తున ఎమ్మెల్యేలను మార్చే అవకాశం లేదు. పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెడితే ఆ నియోజకవర్గంలో మళ్లీ రెండు గ్రూపులను పార్టీ హైకమాండ్ ప్రోత్సహించినట్లవుతుంది. అందుకే తొలుత 70 మంది వరకూ ఎమ్మెల్యేలను జగన్ తప్పిస్తారని భావించినప్పటికీ ఆ దిశగా ఆలోచన విరమించుకున్నారని తెలిసింది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో రెండు గ్రూపులున్నాయి. సిట్టింగ్ లకు టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ మరింత బలహీనమవుతుందని అంచనాలో ఉన్నారు ఇక ప్రశాంత్ కిషోర్ టీం కూడా మూడేళ్లకు ముందే రంగంలోకి దిగడం అనవసరమని భావిస్తున్నారట. ఇప్పుడు నియోజకవర్గాల్లో సర్వే చేసినా ఏం ఉపయోగం లేదని చెప్పారట. చివరి ఏడాది అయితే అభ్యర్థి ఎవరు? అసంతృప్తి ప్రజలలో ఎమ్మెల్యేపై ఎంత ఉన్నది అన్నది సర్వేల ద్వారా తెలుసుకోవచ్చని, ఇప్పటి నుంచి సర్వేలు చేయడం కూడా అనవరసరమని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. పశ్చిమ బెంగాల్ లోనూ ఏడాదిన్నర ముందుగానే సర్వేలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించామని ఆయన చెప్పడంతో ఇప్పుడే పీకే టీంను నియోజకవర్గాల్లో తిప్పడం అనవసరమని జగన్ భావించారు. అందుకే ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలోకి ఇంకా అడుగు పెట్టలేదన్న చర్చ పార్టీలో జరుగుతుంది. నవంబరు నెలలోనే రావాల్సి ఉండగా మూడేళ్ల ముందు అనవసరమని భావించి తమ ఏపీ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
సర్వేలతో అప్ డేట్స్
ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. వైసీపీ వన్ సైడ్ విజయం సాధించింది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ పెత్తనం వైసీపీదే. ప్రతిపక్షాల ఊసే లేకుండా పోయింది. ఎన్నికల్లో అక్రమాలు, బెదిరింపులు, అవకతవకలు అనిచెబుతున్నా 80 నుంచి 90 శాతం ఫలితాలు వైసీపీ వైపునే ఉన్నాయి. ప్రజలు జగన్ పక్షాన నిలిచారనే చెప్పాలి. ఇంత పెద్ద విజయాలు వైసీపీలో అతి విశ్వాసాన్ని పెంచుతాయని కొందరు అంటున్నారు. కానీ జగన్ రాజకీయం వేరు అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ ఇంతకు ముందులా కాదు. రాజకీయంగా రాటు దేలాడు. ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. జనంలోకి తన సంక్షేమ పథకాలు పనిచేస్తున్నాయని సంకేతాలను పంపారు. గెలుపుకు కారణం ఏదైనా కావచ్చు. గెలుపు మాత్రం జగన్ ఖాతాలోనే పడింది. సంక్షేమ పథకాల వల్లనే ఇంతటి విజయాలు సాధ్యమయ్యాయని పార్టీ నేతలకు కూడా పరోక్షంగా హెచ్చరికలు పంపారు. తన మాటే వేదం. శాసనం అన్నది జగన్ ఈ ఫలితాలతో చెప్పకనే చెప్పారు. జగన్ కు అతి దగ్గరగా ఉన్న ఒక మంత్రి చెప్పిన దానిని బట్టి... జగన్ అధికారుల మాటలను నమ్మరు. తనకంటూ ఐదు రకాల సర్వే సంస్థలను జగన్ పెట్టుకున్నారు. ఐదు మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటాడు. ప్రజల్లో తన నిర్ణయంపై వ్యతిరేకత ఉందని ఆ సర్వేల్లో తేలితే వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవడానికి కూడా వెనుకడారట. అంతెందుకు ఇంటలిజెన్స్ సర్వేలు, అధికారుల సంతృప్తి నివేదికలను జగన్ అసలు చూడనే చూడరంటున్నారు జగన్ కు సన్నిహితంగా ఉండే ఆ మంత్రి. ఇక జగన్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని గ్రహించారు. వారికి కొంత సమయం ఇవ్వనున్నారు. పనితీరు మార్చుకుని ప్రజల్లో విశ్వాసాన్ని పొందకపోతే నిర్దయగా వచ్చే ఎన్నికల బరి నుంచి తప్పించనున్నారు. ఈ మేరకు కొందరికి జగన్ సిగ్నల్స్ కూడా ఇచ్చారంటున్నారు. విజయాలను చూసి చంకలు గుద్దుకోవద్దని, ప్రజల్లో మార్పు ఒక్క రోజులో కూడా వస్తుందని జగన్ వారికి హెచ్చరికలు జారీ చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ ను తక్కువగా అంచనా వేస్తే తప్పులో కాలేసినట్లే. ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే జగన్ అందరినీ సిద్ధం చేస్తున్నారు.