లక్నౌ , డిసెంబర్ 1
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్పై వివాదాస్పద పోస్ట్ చేసిన ఆరోపణలపై ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్పై కేసు నమోదైంది. కన్నౌజ్ జిల్లాలోని కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో ఫేస్బుక్ చీఫ్ జుకర్బర్గ్ సహా మరో 49 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే.. అఖిలేశ్పై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఎలాంటి పోస్ట్ పెట్టలేదు, కానీ ఫేస్బుక్ వేదికను దీని కోసం ఉయోగించినందుకు ఆయన్ను కూడా ఈ కేసులో చేర్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లా, సరహతి గ్రామస్థుడు అమిత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అఖిలేశ్ యాదవ్ను కించపరుస్తూ, అవమానకరంగా ఓ ఫేస్బుక్ పేజ్ను నిర్వహిస్తున్నారని అమిత్ పేర్కొన్నాడు. అఖిలేశ్ను అవమానిస్తూ ‘బువా బబువా’ పేరుతో పేజ్ను నిర్వహిస్తున్నారని కోర్టుకు తెలిపారు.ఆయన ఫిర్యాదు మేరకు ఫేస్బుక్ (మెటా) సీఈఓ మార్క్ జుకర్బర్గ్తోపాటు, మరో 49 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అఖిలేశ్ యాదవ్పై కొందరు అసభ్యకరంగా పోస్టులు పెడుతుండటంతో.. అమిత్ కుమార్ మే 25న కన్నౌజ్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అమిత్ పిటిషన్పై విచారణ ప్రారంభించిన కోర్టు.. సరైన ఆధారాలు సమర్పించడంతో… కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ధరంవీర్ సింగ్ పోలీసులను ఆదేశించారు.కోర్టు ఆదేశాల అనంతరం.. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ముందు మార్క్ జుకర్బర్గ్ పేరుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత ఆయన పేరును వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్ పేజ్ యూజర్తోపాటు మరికొంతమందిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.