కరీంనగర్, డిసెంబర్ 2,
రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న టీఎస్‌ఐపాస్ విధానంతో కరీంనగర్ జిల్లాలో పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే 1,834 ఇండస్ట్రీలు ఉండగా, మరో 300 పైచిలుకు వచ్చే అవకాశాలున్నాయి. వేలాది మంది ఉపాధి పొందుతుండగా, మున్ముందు మరిన్ని అవకాశాలు రానున్నాయి.కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమల స్థాపన నానాటికి పెరుగుతోంది. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల, నాగులమల్యాల, గంగాధర మండలం ఒద్యారం, తదితర గ్రామాలు ఈ పరిశ్రమకు కేంద్ర బిందువుగా మారాయి. తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, తదితర మండలాల్లోనూ ఈ పరిశ్రమ విస్తరిస్తోంది. గ్రానైట్‌పై ఆధారపడి కటింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీ జీవం పోసుకుంది. కరీంనగర్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఆసిఫ్‌నగర్, ఎలగందుల, ఖాజీపూర్ గ్రామాల్లో ఈ కటింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఈ తరహాలో 291 పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. సమీప భవిష్యత్తులో మరో 30 పరిశ్రమలు వెలిసే అవకాశాలున్నాయి. ఇక్కడ గ్రానైట్‌ను ఇతర రాష్ర్టాలతోపాటు చైనా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో లభిస్తున్న నాణ్యమైన కలర్ గ్రానైట్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం ఈ పరిశ్రమలో అధికారిక లెక్కల ప్రకారం 5,820 మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. గ్రానైట్ పరిశ్రమ ఆధారంగా 31 స్టోన్ క్రషర్ పరిశ్రమలు వెలిశాయి. ఇందులో సుమారు 500 మంది ఉపాధి పొందుతున్నారు.జిల్లాలో మరో ప్రధానమైన పరిశ్రమ గురించి ప్రస్తావించవచ్చు. ద్వితీయ శ్రేణి నగరమైన కరీంనగర్‌ను ఆనుకుని ఉన్న మానేరు ఒడ్డున ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి ఐటీ టవర్‌ను నిర్మించింది. నిర్మాణం సకాలంలో పూర్తి కాగా, ప్రస్తుతం కొన్ని కంపెనీలు అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. అమెజాన్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు కరీంనగర్‌లో తమ బ్రాంచీలు ప్రారంభించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఐటీ టవర్‌లో పూర్తి స్థాయిలో కంపెనీలు ప్రారంభిస్తే 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు జిల్లాలో ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే 179 రైస్ మిల్లులు, 70 సీడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, 18 కాటన్ మిల్లులు వెలిచాయి. మానకొండూర్, శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక మండలాల్లో ఎక్కువగా వరి విత్తన సాగు చేస్తారు. ఈ నేపథ్యంలో ఏటా 70 వేల నుంచి 90 వేల మెట్రిక్ టన్నుల సీడ్ ఉత్పత్తి జరుగుతున్నది. ప్రముఖ కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకుని విత్తన సాగు చేయిస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే సీడ్‌ను పరిశ్రమల్లో శుద్ధి చేసి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. రైస్ మిల్లు వ్యాపారం కూడా లాభసాటిగా ఉండడంతో కొందరు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు జిల్లాలో వీటిని నెలకొల్పుతున్నారు. జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూర్, సదాశివపల్లి వంటి ప్రాంతాల్లో మిల్లులు ఎక్కువగా విస్తరిస్తున్నాయి. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా చెప్పుకోదగిన రీతిలో విస్తరిస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న సీడ్ వడ్లకు రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కువగా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతున్నారు.వ్యవసాయ అనుబంధంగా పాడి, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా విస్తరిస్తున్నాయి. జిల్లాలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ డెయిరీ రంగంలో మంచి ప్రగతి సాధిస్తోంది. రోజుకు లక్ష లీటర్ల పాల సేకరణ జరుపుతున్న ఈ కంపెనీ మిల్క్ మేకింగ్ ఉత్పత్తులపై దృష్టి సారిస్తోంది. జిల్లాలో పాడి ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ డెయిరీ యాజమాన్యం ఈ పరిశ్రమను ఇంకా విస్తరిస్తోంది. తిమ్మాపూర్ మండలం నల్లగొండలో మరో భారీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. జిల్లాలో ఇలాంటివి మరో రెండు పారిశ్రమలు కూడా ఉన్నాయి. వీటిలో 350 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. ఇక పౌల్ట్రీ రంగం నానాటికీ విస్తరిస్తోంది. చిన్నా చితక కలిపి సుమారు 2 వేలకుపైగా పౌల్ట్రీలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే గుడ్లు, కోళ్లను తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ర్టాలకూ ఎగుమతి చేస్తున్నారు.జిల్లాలో ఇతర పరిశ్రమలను స్థాపించేందుకు కూడా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. ఇతర పరిశ్రమల వివరాలను పరిశీలిస్తే తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో ఇథనాల్ పరిశ్రమ ఒకటి ఉంది. జమ్మికుంట మండలం వావిలాలలో ఖాదీ పరిశ్రమ కూడా ఉంది. ఇవి కాకుండా ఫీడ్ మిక్సింగ్, పేపర్ ప్రొడక్ట్ మేకింగ్, జనరల్ ఇంజినీరింగ్, పవర్ లూమ్స్, దినపత్రికల ప్రింటింగ్ పరిశ్రమలు ఉన్నాయి.