తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శంఖుచక్రాలతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి జెఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్లు శేషగిరి, మధుసుదన్, ఏవిఎస్వో వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.