గుంటూరు, డిసెంబర్ 2,
పాత న్యూస్ పేపరే అంటూ పారేయకండి.. దానికి విలువ చాలానే ఉంది.. ఒకప్పుడు కేజీ రూ.10కి కూడా అమ్ముడు పోని.. పాత న్యూస్ పేపర్ ఇప్పుడు ఎంతనుకుంటున్నారు.. అక్షరాల యాభై రూపాయలు.. ఎందుకు అంత రేటంటారా.. గుంటూరులో అంతే అంతే అంటున్నారు వ్యాపారస్థులు. కార్పొరేషన్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయంతో పాత న్యూస్ పేపర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో పాత పేపర్ల ధరలు అమాంతం పెరిగినట్లు వ్యాపారస్థులు పేర్కొంటున్నారు. గతంలో కేజీ పది పదిహేను రూపాయలున్న ధర ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు పెరిగి యాభై రూపాయలకు చేరుకుంది. కార్పోరేషన్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది. నిషేధం విధించడమే కాకుండా పక్కగా అమలు చేస్తుంది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తయారు చేస్తే 50 వేల రూపాయలు, రిటైల్ గా విక్రయిస్తే 2,500 నుంచి 15 వేల రూపాయలు, క్యారీ చేస్తే 250 నుంచి 500 రూపాయలు ఫైన్ విధిస్తుంది.అంతేకాకుండా కార్పోరేషన్ పరిధిలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కచ్చితంగా అమలు చేస్తోంది. దీంతో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం తగ్గిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా చిరు వ్యాపారులంతా పాత పేపర్లనే వినియోగిస్తానన్నారు. అరటి పళ్ళు, జామ కాయలతో పాటు ఇతర పండ్లు విక్రయించే వారంతా పేపర్లు, పేపర్ కవర్సే వినియోగిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా పాత న్యూస్ పేపర్ల ధరలు పెరిగిపోయాయి. దీంతో వాటిని సేకరించే వారి సంఖ్య పెరిగింది. అయితే.. ఒకప్పుడు పాత న్యూస్ పేపర్లను ఎవరూ పట్టించుకునే వారు కాదని.. ఇప్పుడు గుంటూరులో వాటికి భారీ గిరాకీ ఉందని పేర్కొంటున్నారు. దీంతో వ్యాపారస్థులు ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు.