YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పెద్ద నిర్మాతలకు కష్టాలు

పెద్ద నిర్మాతలకు కష్టాలు

విజయవాడ, డిసెంబర్ 2,
ప్రమోషన్లు సరే… కలెక్షన్ల మాటేంటి? పైకి గంభీరంగా కనిపిస్తున్నారు గాని…పెద్ద సినిమా నిర్మాతల గుండెల్లో ఈ గుబులు మామూలుగా లేదు. రోజుకు నాలుగాటలు మాత్రమే.. అంతకు మించి షోలు వేస్తే తోలు తీసుడే అని డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన ఏపీ సర్కారుతో పెద్ద చిక్కొచ్చి పడింది నిర్మాతలకు. డిసెంబర్ నెల మొదలైపోతోంది. అఖండతో మొదలుపెడితే నెక్స్ట్ సమ్మర్ దాకా వారానికో పెద్ద సినిమా చొప్పున రిలీజ్ కోసం క్యూలో నిలబడ్డాయి.పెద్ద హీరోల సినిమాలకు అభిమానులే ఆక్సిజన్! వాళ్లతో వచ్చే ఓపెనింగ్స్ మాత్రమే సినిమాను నిలబెట్టేది. కానీ… మొదటి మూడురోజుల్లో పడే బెనిఫిట్ షోలతో మాత్రమే ఓపెనింగ్స్ బలపడేది. ‘ఒరిజినల్ టాక్’ బైటికొచ్చి అసలు రంగు బైటపడేలోపలే ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకోవాలి. లేదంటే.. మొదటికే మోసం. అదనపు ఆటలు లేకపోతే మినిమమ్ ఓపెనింగ్స్ రావు.. ఒక సినిమా టాక్ బైటికొచ్చేలోపే మరో సినిమా రిలీజైపోతుంటే… థియేటర్లో వుండే సినిమాకు ‘లాంగ్ రన్’ ఛాన్స్ లేదు. అందుకే… అడకత్తెరలో పోకచెక్కలా… అగమ్య గోచరంగా మారింది పెద్ద సినిమాల పరిస్థితి.ఏపీ సర్కార్ చేసిన చట్టసవరణతో బిగ్ మూవీస్ నిర్మాతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. మన సినిమాలు రిలీజయ్యేలోగా ఏదో ఒకటి చేసి సీఎంను ప్రసన్నం చేసుకోవాలని, బెనిఫిట్ షోస్ కి పర్మిషన్లు తెప్పించుకోవాలని అందరికీ వుంది. కానీ పిల్లి మెళ్ళో గంట కట్టేదెవరన్నదే ప్రశ్న. ఇది సక్రమంగా లేదు… పొరుగు రాష్ట్రాల్లోలాగే మాకూ సమన్యాయం కావాలి అంటూ ఒక ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అప్పుడప్పుడూ ధైర్యంగా గొంతెత్తి మాట్టాడే దగ్గుబాటి సురేష్ బాబు కూడా మైకుల ముందు నాలుగు మాటలతో సరిపెట్టేశారు. చిన్న హీరో అయినా స్టేజినెక్కి పెద్దగా గొంతు చేసుకునే నేచురల్ స్టార్ నానీ కూడా ‘నేను ఎప్పుడో మాట్లాడేశా… ఇక పెద్దోళ్లే చూసుకోవాలి’ అంటూ స్కైలాబ్ ఈవెంట్ లో సైడ్ ఇచ్చుకున్నారు.రిపబ్లిక్ ఈవెంట్ లో ఆంతెత్తున అరిచినందుకు ‘నీవల్లే రొచ్చయింది’ అని అపవాదును మూటకట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.మంత్రి పేర్ని నాని అయితే… సినిమాటోగ్రఫీ శాఖ సీఎం దగ్గరే వుంది… ఆయనేది చెబితే నేను అదే చేస్తా అంటూ చేతులెత్తేశారు. ఇప్పటికే చాలా చేసి చేతులు కాల్చుకున్నాం.. మా వల్ల కాదు అంటూ దిల్ రాజు లాంటి వాళ్లంతా ప్రేక్షపాత్ర వహిస్తున్నారు. కొందరికి రాజకీయ పట్టింపులు, మరికొందరికి భేషజాలు… ఇప్పుడు ముందుకొచ్చేదెవ్వరు.? పెద్ద సినిమాల్ని గట్టెక్కించే పెద్దన్న జాడ ఎక్కడ? అంటూ ఇండస్ట్రీస్‌లో పెద్ద చర్చ జరుగుతోంది.
రేట్లు ఫిక్స్ చేసిన సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో అమ్మేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలతో చర్చలు జరిపింది జగన్ సర్కార్.ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ టికెట్ విధానానికి మొగ్గుచూపింది సర్కార్. అయితే తాజాగా టికెట్ల ధరలను ప్రభుత్వమే విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియా, నగర పంచాయితీ ఏరియా, గ్రామపంచాయతీ ఏరియాల వారీగా టికెట్ల ధరలను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఈ టికెట్ల ధరలను ఫైనల్ చేస్తూ జీవో కూడా జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రతిరోజు కేవలం నాలుగు షోలు మాత్రమే నిర్వహించాలని… ప్రభుత్వం ఖరారు చేసిన ధరలకే ఇకనుంచి సినిమా టికెట్లు అమ్మ నున్నట్టు జీవోలో పేర్కొంది. ఇక నుంచి టికెట్లు ఆన్ లైన్ లోనే తీసుకోవాలని పేర్కొంది ప్రభుత్వం. కాగా టిక్కెట్ల ధరలను పెంచాలని నిర్మాతలు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts