నెల్లూరు, డిసెంబర్ 2,
ఆయనదో టైపు..! అందరూ ఒకలా ఉంటే ఆయన మరోలా ఉంటారు. కమ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆ నేతది ఎప్పుడూ డిఫరెంట్ స్టైలే. ఆయనకు పార్టీ కంటే సొంత ముద్ర వేసుకోవడమే బాగా ఇష్టం. తాజాగా ఆయన చేసిన పనితో పార్టీ విస్తుపోయింది.రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏది చేసినా తన ముద్ర ఉండేలా చూసుకుంటారు. వరసగా రెండుసార్లు గెలిచిన కోటంరెడ్డి పార్టీకి తలనొప్పిగా మారారట. ఇప్పటికే ఆయన మీదా చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తనకు అడ్డాగా చేసుకున్న శ్రీధర్ రెడ్డి.. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు బహిరంగంగానే చెప్పుకొంటుంటారు. పార్టీకి కూడా ఆ విషయాలు తెలుసునట. అయినా ఎమ్మెల్యే స్పీడ్ ఎక్కడా తగ్గలేదు. చెప్తే వినరని అనుకున్నారో ఏమో పార్టీ వైపు నుంచి కూడా ఆయనకు ఎవరూ ఏమీ చెప్పడంలేదనే… స్థానికులు అనుకుంటున్నారట.పార్టీ కంటే తన సొంత ముద్రతోనే గెలవాలనేది… జనంలో గుర్తింపు ఉండాలనేది శ్రీధర్ రెడ్డి అజెండా. గతంలో ఓసారి పాదయాత్ర చేస్తే అందులో వైసీపీ జెండా ఎక్కడా కనిపించకుండా చేశారు. అప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో పెద్దలు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ పిలుపుతో సంబంధంలేకుండా తనకు తాను సొంతంగా కార్యక్రమాలు రూపొందించుకుని జనంలోకి వెళ్లడం ఆయనకు అలవాటు. పార్టీ పేరు చెప్పడం ఎందుకు అనుకుంటారో…. లేక చెప్తే నష్టం అనుకుంటారో తెలియదు కానీ… శ్రీధర రెడ్డి మాత్రం తను అనుకున్నదే చేసేస్తారు.అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో భూములు ఇచ్చిన రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది. భారీ వర్షాల కారణంగా రెండు రోజుల నుంచి యాత్రను నిలిపివేసి అక్కడే మకాం వేశారు. దాదాపు 23 మూడు రోజుల నుంచి యాత్ర జరుగుతోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలగుండా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది పాదయాత్ర. టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతలు యాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ యాత్రను యాత్రే కాదు.. అది టీడీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రాం, పాల్గొనేవారంతా పెయిడ్ ఆర్టిస్టులని వైసీపీ ఎదురుదాడి చేస్తూనే ఉంది. మరోవైపు అసెంబ్లీ మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసింది. త్వరలో పకడ్బందీగా మరో చట్టాన్ని తెస్తామని కూడా చెబుతోంది. అమరావతి విషయంలో వైసీపీకి అంత పట్టుదల ఉందన్న మాట.అలాంటి అమరావతి కోసం జరుగుతున్న పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యక్షం అయ్యారు. రైతులు బస చేస్తున్న శిబిరంలోకి వెళ్లిన కోటంరెడ్డి.. వారిని అప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేయాలని.. తాను అండగా ఉంటానని చెప్పి ఫోన్ నంబర్ సైతం ఇచ్చేశారు. జై అమరావతి అని నినాదం చేయాలని, ఉద్యమం తాలుక ఆకుపచ్చ కండువా వేసుకోవాలని అక్కడి వారు కోరగా… అలా చేయలేనని తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారట ఎమ్మెల్యే. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండటానికి వైసీపీ వ్యతిరేకం. ఆ పార్టీలో ఉన్న అందరిదీ అదే మాట కావాలి. అదేమాట చెప్పాల్సిన శ్రీధర్ రెడ్డి… తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ…. తను అనుకూలమైనా… పార్టీ కాదు అన్నట్టు అర్ధం వచ్చేలా మాట్లాడారట.ఎమ్మెల్యే ఇలా వెళ్లారో లేదో అలా మీడియాలో ఈ వార్తలు ప్రముఖంగా వచ్చాయి. పార్టీ కూడా ఆరా తీసింది. కోటంరెడ్డి ఎందుకు ఇలా? అని అడిగారట. తన ఉద్దేశం వేరని నచ్చజప్పేందుకు శ్రీధర్ రెడ్డి ప్రయత్నించారట. అయినా సంతృప్తి చెందని తాడేపల్లి… మీడియా సమావేశం పెట్టి పార్టీ లైన్ దాటకుండా దాని నుంచి బయటపడేలా మాట్లాడమని చెప్పారట. ఎంత మాట్లాడినా.. ఏం చెప్పినా… జరగాల్సిన డామేజీ జరిగిపోయిందని అగ్రనేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారట.