రాజోలు
గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు పై సర్పంచులు ఆందోళన రోజు రోజుకూ ఉదృతమవుతోంది. 14 వ ఆర్థిక సంఘం నిధులను కరెంటు బిల్లులు పేరిట జమ చేసుకోగా, 15 వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నుంచి మళ్లించడం పట్ల గ్రామ సర్పంచులు ప్రభుత్వం పై మండిపడుతున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీటి కుళాయిలు, వంటి ప్రధాన సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యలను కూడా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను మల్లించికుపోవడం దురదృష్టకరమైన సంఘటన అని సర్పంచులు నిరసిస్తున్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండల గ్రామ సర్పంచులు మలికిపురం సెంటర్ లో జాతీయ నాయకుల విగ్రహాల వద్ద నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందు పరచబడిన విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక సంఘం నుండి నిధులు వస్తే ఆ నిధులను గ్రామ సర్పంచ్ ల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీల నుండి మళ్లించిన 15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే తిరిగి జమ చేయాలని సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.