YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో శిల్పా ప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో శిల్పా ప్రకంపనలు

హైదరాబాద్, డిసెంబర్ 2,
కిట్టీ పార్టీలతో సంపన్న వర్గాలకు చెందిన మహిళలను బుట్టలో వేసుకుని వందల కోట్ల రూపాయలు కాజేసిన శిల్పాచౌదరి ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇంత మందిని ఆమె తన మాటలతో ఎలా బుట్టలో వేసుకుందా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. అయితే వందల కోట్లు కాజేసిన శిల్పాచౌదరి కేవలం రూ.కోటిన్నర వ్యవహారంలో తలెత్తిన విబేధాలతో ఇప్పుడు ఊచలు లెక్కపెడుతుండటం గమనార్హం. దివ్యారెడ్డి అనే మహిళకు రూ.కోటిన్నర ఇవ్వకుండా వేధిస్తున్నందునే ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఆమె గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి.శిల్పాచౌదరి ఆ రూ.కోటిన్నర ఇచ్చేస్తే ఆమె మోసాలు బయటపడేవి కావని పోలీసులే చెబుతున్నారంటేనే ఇన్నాళ్లూ ఎంత పకడ్బందీగా తన వ్యవహారాలు సాగించిందో అర్ధమవుతోంది. దివ్యారెడ్డి ఫిర్యాదు తర్వాతే శిల్పాచౌదరిపై కేసులు పెరిగాయని, బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే బాధితులు ఆమెకు ఇచ్చినదంతా బ్లాక్ మనీ కావడంతో లెక్కాపత్రాలు లేవని, అందువల్ల నేరుగా ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పరిధిలో శిల్ప బాధితులు పోలీస్‌స్టేషన్లకు వరుస కడుతున్నారు. వీరిలో చాలామంది మౌఖికంగా ఫిర్యాదు చేస్తున్నారే తప్ప.. లిఖితపూర్వకంగా కంప్లైంట్‌ ఇవ్వడానికి వెనకంజ వేస్తున్నారు.అయితే ఇక్కడే శిల్పాచౌదరి చాలా పకడ్బందీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బ్లాక్‌ మనీ కారణంగా బాధితులు పైకి చెప్పుకోలేరన్న ధైర్యంతో ఆమె వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు సైతం చెబుతున్నారు. బ్లాక్‌ మనీ కావడం వల్లే.. బాధితులు శిల్పపై కేసుకు సిద్ధపడడం లేదని పేర్కొంటున్నారు. ఓ బడా సినీ నిర్మాత కుమార్తె కూడా శిల్పాచౌదరికి రూ.3 కోట్లు ఇచ్చి మోసపోయినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు.మరోవైపు శిల్పాచౌదరి హవాలా మార్గంలో రూ. 50 కోట్లు విదేశాలకు మళ్లించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ మొత్తాన్ని ఎవరికి పంపారు? అనే కోణంపై దృష్టి సారించారు. శిల్ప దంపతుల మొబైల్‌ ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాలంటే శిల్పాచౌదరి దంపతులను నాలుగురోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే శిల్పా తరపు న్యాయవాదులు దీనికి కౌంటర్ ఇవ్వడంతో పాటు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Related Posts