YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాషాయం గూటికి మరో ఉద్యమ నేత

కాషాయం గూటికి మరో ఉద్యమ నేత

హైదరాబాద్, డిసెంబర్ 2,
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ కీలక నేతలకు గాలం వేస్తోంది. ఈటల రాజేందర్ చేరిక, హుజురాబాద్‌లో ఘనవిజయంతో కమలనాథుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే మరో ఉద్యమనేత బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చింతలగట్టు విఠల్‌ త్వరలో బీజేపీ తీర్థం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విఠల్‌ కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు.టీఎస్‌పీఎస్పీ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తరువాత ఆయనకు టీఎస్‌పీఎస్పీ చైర్మన్‌ లేదా ఏదైనా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కవచ్చనే ప్రచారం కూడా జరిగినా అది సాధ్యం కాలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ మార్చడాన్ని తప్పుబట్టారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉద్యమ నేతలతో జరిగిన అంతర్గత చర్చల్లోనూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసే విషయమై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో విఠల్‌ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా విఠల్‌ను సంప్రదించిన బీజేపీ నేతలు పార్టీలోకి ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది.కాపు సామాజిక వర్గానికి చెందిన విఠల్ చేరికతో తెలంగాణలో పార్టీ మరింత బలపడే అవకాశాలున్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఇతర ముఖ్య నాయకులు, సంఘ్‌ పరివార్‌ బాధ్యులు కూడా ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఉద్యోగ సంఘం నేతగా విఠల్‌ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే జాతీయ నేతల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా, జేఏసీ సెక్రటరీ జనరల్‌, కో-చైర్మన్‌గా వివిధ హోదాల్లో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని పరుగులు పెట్టించిన విఠల్ ‘తెలంగాణ విఠల్‌’గా ప్రసిద్ధి చెందారు. సమైక్య రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. 1996 నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే వరకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ప్రొఫెసర్‌ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి పని చేశారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్‌లో జన్మించిన విఠల్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.కామ్‌, ఎల్‌ఎల్‌బీ(ఎం.ఫిల్‌) చదివారు. కొంతకాలం జర్నలిస్టుగా, ఎయిడెడ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-2లో ఆడిటర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 24 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014, డిసెంబరు 18 నుంచి 2020, డిసెంబరు 17వ తేదీ వరకు టీఎస్పీఎస్సీ సభ్యులుగా పనిచేశారు. విఠల్‌కు ప్రభుత్వ ఉద్యోగిగా, టీఎస్పీఎస్సీ బోర్డు మాజీ సభ్యుడిగా రావాల్సిన పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరి కేసీఆర్‌కు షాకిచ్చేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Related Posts