న్యూఢిల్లీ, డిసెంబర్ 3,
ఆంధ్రప్రదేశ్ గంజాయి ప్రదేశ్ గా మారింది.. ఇదీ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గురించి వినిపిస్తున్న మాట. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా ఏపీలో గంజాయి సాగు పెరిగిందని, రవాణా విచ్చలవిడిగా సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోటు గంజాయి పట్టుబడుతూనే ఉంది. హైదరాబాద్ సహా దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా... దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటున్నాయి. దీంతో ఏపీ గంజాయి కేరాఫ్ గా మారిందనే విమర్శలు వస్తున్నాయి. జగన్ సర్కార్ చేతగానిగతనం వల్లే ఏపీ అరాచకాలకు అడ్డాగా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి అయితే విపక్షాల ఆరోపణలను ఖండిస్తోంది వైసీపీ. ఏపీ గంజాయి సాగు నియంత్రణలోనే ఉందని చెబుతోంది. గంజాయి రవాణాను అడ్డుకుంటున్నామని, ఇటీవల కాలంలో బాగా కట్టడి చేశామని పోలీస్ శాఖ ప్రకటిస్తోంది. తాజాగా పార్లమెంట్ సాక్షిగా ఏపీ సర్కార్ బండారం బయటపడింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ఈ విషయమై చేసిన ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఏ రేంజ్ లో సాగవుతుందో తెలిసిపోయింది. అందరిని విస్తుపోయేలా చేస్తోంది. అంతేకాదు గత టీడీపీ పాలనకు జగన్ పాలనకు ఎంత తేడా ఉందో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో దొరికిన గంజాయి పరిమాణం మూడేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు కేంద్ర మంత్రి రాజ్యసభకు తెలిపారు. టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ విషయాన్ని వెల్లడించారు. 2018లో 33,930.5 కిలోల గంజాయి ఆధారిత మాదకద్రవ్యాలును స్వాధీనం చేసుకోగా, 2019లో అది రెండింతలై 66,665.5 కిలోలకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక గతేడాది ఇది ఏకంగా మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్న మంత్రి.. 1,06,042.7 కిలోలను ఎన్‌డీపీఎస్ చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రి ప్రకటనతో జగన్ సర్కార్ పాలన ఎంత అస్తవ్యస్థంగా ఉందో అర్ధమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.