విశాఖపట్నం
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల మరియు వినియోగదారుల ఆర్గానిక్ మేళాకు విశాఖ నగరంలోని ఆళ్వార్ దాస్ గ్రౌండ్ వేదిక అయింది. నాబార్డ్ చైర్మన్ డాక్టర్ గోవిందరాజులు ఈ మేళా ను ప్రారంభించారు. ప్రస్తుతం సమాజంలో కెమికల్స్ తో కూడిన వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడానికి అలవాటు పడిన వినియోగదారులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అలవాటు చేయడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ ఆర్గానిక్ మేళా నిర్వహించారు. డిసెంబర్ 3వ తేదీ నుండి ఇ 5వ తేదీ వరకు ఆర్గానిక్ మేళా జరగనుంది. ఈ మేళాలో ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తులను ప్రదర్శనగా ఏర్పాటు చేసి ప్రజలలో అవగాహన కలిగిస్తూ అమ్మకాలు చేస్తున్నారు. మొత్తం 115 స్టాల్స్ ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేళాను ప్రారంభించిన నాబార్డ్ చైర్మన్ డాక్టర్ గోవిందరాజులు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా ఇటువంటి ఆర్గానిక్ మేళాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనికి తగ్గట్టుగా నాబార్డ్ సంస్థ తన వంతు గా కృషి చేస్తుందని తెలిపారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల మరియు వినియోగదారుల సంఘం వ్యవస్థాపకుడు కుమారస్వామి మాట్లాడుతూ సమాజంలోని రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే విషపూరితమైన మందులతో వ్యవసాయం చేయడం మానేసి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని సూచించారు. ఇందులో భాగంగానే ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కలిగించడానికి రెండోసారి ఆర్గానిక్ మేళా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్సీ మాధవ్, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.