YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూన్ 1 నుంచి బడిబాటకు ప్రణాళికలు

జూన్ 1 నుంచి బడిబాటకు ప్రణాళికలు

రాష్ట్రంలో 2018-19 విద్యాసంవత్సరానికి జూన్ 1 నుంచి బడిబాటకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. దాదాపు రెండువారాలు బడిబాట నిర్వహించడానికి ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించింది. జూన్ 1 నుంచే పాఠశాలలను పున:ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. బడిబాటలో భాగంగా అన్నిరకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచే ప్రయత్నం చేస్తునట్టు విద్యాశాఖ ఇంచార్జ్జి డైరెక్టర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు. బడిబాట నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సర్వశిక్షా అభియాన్ ఏఎస్పీడీ శ్రీహరి తెలిపారు. బ్యానర్లు, కరపత్రాలతో గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన నిర్మాణాలు, వసతి సదుపాయాల కల్పన, మధ్యాహ్న భోజన పథకం మరింత సమర్థంగా అమలు చేయడంతోపాటు గతంకంటే ఈసారి ఉత్తీర్ణత పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బాలికల ఎన్‌రోల్‌మెంట్‌ను కూడా గణనీయంగా పెంచాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

హైదరాబాద్‌ జిల్లాలోని 3468 బడులు తెరుచుకోనుండగా 12 లక్షల మంది బడిబాట పట్టనున్నారు. ప్రైవేటు బడుల్లో 30శాతం ఇప్పటికే తెరుచుకున్నాయి. జూన్‌ 1నుంచి తరగతుల నిర్వహణ కూడా మొదలు పెట్టనున్నాయి. కాగా, తెలంగాణలోని సుమారు నాలుగువేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమంలో బోధించనున్నట్లు తెలిసింది. దీంతో గత ఏడాదికంటే ఈసారి ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండొచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమంలో బోధించేందుకు జిల్లా విద్యాధికారుల నుంచి ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరించింది. అయితే, చాలా చోట్ల ఆంగ్లమాద్యమంలో బోధన కోసం టీచర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇంతవరకు ప్రారంభించలేదు. ఒకటో తరగతిలో ప్రవేశంపొందిన విద్యార్థులకు ఆంగ్లమాధ్యమ పుస్తకాలను సమకూర్చలేదు. కాగా, ఆంగ్లమాద్యమం కోసం బోధనా సిబ్బంది, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ, పంచాయతీ సభ్యులు తీర్మానించి ప్రభుత్వానికి నివేదించారు. కొన్నింటిలో ఆరు, ఏడు తరగతుల్లో ప్రవేశం కూడా కల్పించారు. ఇందులో ఎన్నింటికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందోనని ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.

Related Posts