వరద సాయం అందని బాధితులు 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి
నెల్లూరు డిసెంబర్ 3
నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద పరిస్థితిపై అధికారులతో పూర్తిగా మాట్లాడినట్లు తెలిపారు. వరద బాధితులకు ఇంటికి రూ. 2వేలతో పాటు రేషన్ కూడా అందినట్టు అందరూ చెబుతున్నారని తెలిపారు. రానివాళ్లు 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పెన్నానది నుంచి వరద నివారణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరకట్ట బండ్ నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామని ఆ పనులకు శంకుస్థాపన తానే చేస్తానని చెప్పారు. కొట్టుకుపోయిన సోమశిల డ్యామ్ అఫ్రాన్ నిర్మాణం కోసం రూ.120కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. వరద సహాయం అందని వారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వరదల్లో బాధితులను ఆదుకోవడంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నగర కమినర్ దినేష్ పని తీరును ప్రశంసించారు.భగత్‌సింగ్ నగర్ కాలనీలో కోతకు గురైన పెన్నా నదిని సీఎం జగన్ పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు.పెనుబల్లిలో దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల, పంట పొలాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. జొన్నవాడ వద్ద తెగిపోయిన పెన్నా నది పొర్లు కట్టని సీఎం జగన్ పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం.. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు రూరల్ మండలంలోని దేవరపాలెనికి వెళ్లి వరదలు కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, కోతకు గురైన కరట్టను పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వరద నష్టాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజాప్రతినిధుల నుంచి వినతి ప్రతాలను సీఎం స్వీకరించారు. వరద బీభత్సంపై ప్రజా ప్రతినిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు.