విజయవాడ, డిసెంబర్ 4,
టార్గెట్-2024 అంటూ బీజేపీ అధినాయకత్వం ఏపీ రాష్ట్రానికి కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడా కమిటీ కూర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కమిటీలో అంతా బయట నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఇదేం చిత్రం అంటూ కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారట. ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. పాతవారు పని చేయకపోతే కొత్తవారికి పెద్దపీట వేయక తప్పదుగా అని చెవులు కొరుక్కుంటున్నారట.తిరుపతిలో అమిత్ షాతో ఏపీ బీజేపీ నేతల భేటీ తర్వాత కమలనాథుల్లో దూకుడు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో భాగమయ్యారు నాయకులు. కారణాలేమైనా.. తెరవెనక ఏ మంత్రాంగం జరిగినా.. బీజేపీ నేతలు అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న మరుసటిరోజే పాలనా వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది తమవల్లే జరిగిందనే విషయాన్ని బీజేపీ నేతలు గట్టిగా చెప్పుకోకున్నా.. ఏపీ రాజకీయాల్లో జరిగే అంతర్గత చర్చల్లో ఆ పార్టీ అధినాయకత్వం ఒత్తిడి ఉందేమోననే భావన బలంగానే వినిపిస్తోంది.ఈ క్రమంలోనే ఏపీ బీజేపీకి కొత్తగా కోర్ కమిటీని నియమించింది కేంద్ర నాయకత్వం. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా మొత్తం 13 మంది కమిటీలో సభ్యులు. మరో ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు. ఈ కమిటీ కూర్పుపైనే కాషాయ శిబిరంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కోర్ కమిటీలో చాలామంది కొత్త వారే. అదీ టీడీపీ నుంచి వచ్చినవాళ్లే ఉండటంతో తలో రకంగా చర్చించుకుంటున్నారు. టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు 2019 ఎన్నికల తర్వాత పార్టీ మారితే.. 2014 ఎన్నికల్లో పార్టీ మారిన పురందేశ్వరి.. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణలను కొత్తవారి కిందే లెక్కలేస్తున్నారట.పార్టీలో విష్ణువర్దన్‌రెడ్డి, రమేష్‌నాయుడు వంటి చాలా మంది బీజేపీనే నమ్ముకుని ఉన్నారు. వారికి పార్టీ లోతుపాతులు తెలిసినా.. పార్టీని నడిపించే శక్తి రాలేదు. కానీ.. ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టివి అన్నట్టు వారికి కోర్ కమిటీలో చోటు ఇవ్వలేదు. గతంలో పార్టీ కో ఇంచార్జ్ దేవధర్ చెప్పినట్టు పలు పార్టీల నుంచి వచ్చి బీజేపీని పార్కింగ్ ప్లేస్‌గా వాడుకుంటున్నారో.. పర్మినెంట్ అనుకుంటున్నారో భవిష్యత్ తేలుస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నవాళ్లను వదిలేయకుండా.. వాళ్లతోపాటు వీళ్లకీ చోటిస్తే బాగుండేది అనే వాదన పార్టీలో ఉందట.అమిత్ షాతో భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో సీఎం రమేష్, సుజనా చౌదరిలకు ప్రాధాన్యం పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే కోర్ కమిటీలో వారికి చోటిచ్చారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీ నారాయణకు బీజేపీ ఏపీ అధ్యక్ష పదవే ఇవ్వగా లేనిది.. ఇప్పుడు కోర్ కమిటీలో కొత్తవారికి స్థానం కల్పిస్తే తప్పేంటనేది కొందరి వాదన. అమిత్ షా కూడా తిరుపతి భేటీలో ఇదో టోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన కొందరు ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి.. హిందూత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తున్న అంశాన్ని గుర్తు చేస్తున్నారట.
అయితే పాతవాళ్లు సరిగా పనిచేసి ఉంటే కొత్తవాళ్లకు ఛాన్స్ ఎందుకు వస్తుందనే వాదనా ఏపీ బీజేపీ వర్గాల్లో ఉంది. మన బంగారం మంచిగా ఉంటే.. పక్క చూపులు ఎందుకు చూస్తాం అని గుసగుసలు పోతున్నాయి బీజేపీ శ్రేణులు.