YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బెంగాల్ టూ ఢీల్లీ....వయా ముంబై

బెంగాల్ టూ ఢీల్లీ....వయా ముంబై

న్యూఢిల్లీ, డిసెంబర్ 4,
బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం మమతా బెనర్జీ అంచనాలను పెంచింది. ఆ గెలుపు ఆమెను ప్రధాని పీఠంపై కన్నేసేలా చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి అసలు సిసలు ప్రత్యర్థి తానే అని భావిస్తున్నారామె. ఆ భావనను ప్రజలలో స్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు, మొదట కాంగ్రెస్ పై పైచేయి సాధించాలని చూస్తున్నారు. అందుకే హస్తం పార్టీ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. పొరుగున ఉన్న ఈశాన్య భారతం టార్గెట్‌గా కాంగ్రెస్‌ని ఖాళీ చేయిస్తున్నారు. అదే సమయంలో పెద్ద రాష్ట్రాల ప్రాంతీయ నేతలతో రాజకీయం నెరపుతున్నారు. దేశంలో కాంగ్రెస్‌ లేకుండా చేయటమే లక్ష్యంగా దీదీ ముందుకు సాగుతున్నారు.విపక్షాలను ఏకం చేయడంలో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమైందంటూ దీదీ తరచూ విరుచుకుపడతారు. ఈ సారి ఏకంగా ఆమె హస్తం పార్టీ నేతృత్వంలోని యూపీఏ అస్తిత్వాన్నే ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో యూపీఏ అంటూ ఏమీ లేదన్న ఆమె కామెంట్‌ కలకలం రేపుతోంది. ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో సమావేశం తరువాత మమత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. తమ పార్టీ లేకుండా బీజేపీని ఓడించగలమని కలలు కనడాన్ని మానుకోవాలంది. శరద్ పవార్‌ను ఇరుకున పెట్టేందుకు బెనర్జీ కుట్ర పన్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. .కాంగ్రెస్‌తో పోల్చి చూస్తే మమతా బెనర్జీకి నిజంగా అంత శక్తి ఉందా? 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఆమె బీజేపీకి ప్రధాన ముప్పుగా అవతరించగలదా? విభిన్న అజెండాలతో అనేక వైరుద్యాలు కలిగిన ప్రతిపక్ష పార్టీలను ఆమె ఏకం చేయగలదా? ప్రస్తుతం ఆమె ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనే పనిలో ఉన్నారు. అందుకు మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నారు.మొదటి వ్యూహం.. ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆకర్షించడం. వివిధ పార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్‌లో నిర్లక్ష్యానికి గురైన నేతలు. నిజానికి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే టీఎంసీలో చేరికల సందడి మొదలైంది. విజయం సాధించిన నెల లోపే గతంలో టీఎంసీ నుంచి బీజేపీకి మారిన పలువురు నాయకులు మమతా బెనర్జీ పార్టీలోకి తిరిగి రావాలని సూచించారు. కాంగ్రెస్‌ నుంచి వలసలు మాత్రం మాజీ ఎంపీ సుస్మితా దేవ్ తో ప్రారంభమైంది. ఆమె అస్సాంకు చెందిన కాంగ్రెస్‌ దిగ్గజం దివంగత సంతోష్‌ మొహందేవ్‌ కూతురు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్‌. రాహుల్ గాంధీ టీమ్‌లో కీలక సభ్యురాలు. అందుకే ఆమె కాంగ్రెస్‌ను వీడటం కొంత ఆశ్చర్యం కలగించింది. ఐతే, సుస్మితను టీఎంసీ రాజ్యసభకు పంపింది.పార్టీ బహిష్కరణకు గురైన జనతా దళ్‌- యూ మాజీ ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ, మాజీ లోక్‌సభ సభ్యుడు కీర్తి ఆజాద్‌ టీఎంసీలో చేరారు. మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేసినకీర్తి ఆజాద్ బీజేపీ, కాంగ్రెస్‌ రెండిండిలో పనిచేశారు. రెండు చోట్లా పక్కన పెట్టారు. దాంతో వారు తృణమూల్‌లో చేరారు. వీరి చేరిక టీఎంసీ బలాన్ని తెలియజేస్తోంది. మరికొంత మంది నేతలు చేరటానికి ధైర్యాన్నిస్తుంది.రెండవ వ్యూహం.. బెంగాల్‌కు మాత్రమే పరిమితమైన టీఎంసీకి దేశ వ్యాప్త పునాదులు వేయటం. అందుకోసం, ముందు చిన్న రాష్ట్రాలను టార్గెట్‌ చేయటం. ఆ రాష్ట్రాలలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ఏర్పాట్లు చేయడం. త్రిపురతో మొదలైన ఆ కార్యక్రమం మేఘాలయ వరకు వచ్చింది. కింద వేలాడే పండ్లను ముందు కోయాలన్నది దీదీ వ్యూహం. అందుకే, బీజేపీ చేతిలో కాంగ్రెస్ కంగుతిన్న రాష్ట్రాలపై టీఎంసీ కన్నేసింది.దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణకు మమత మొదట త్రిపురను ఎంచుకున్నారు. అక్కడ మెజారిటీ జనాభా బెంగాలీలు. కాబట్టి త్రిపురలో జెండా పాతటం మిగతా వాటితో పోలిస్తే కొంత సులభం. అందుకే ముందు అక్కడ పార్టీ స్థావరాలను విస్తరించాలనుకున్నారు. ఏడుగురు సీనియర్ కాంగ్రెస్ నేతలు గత జూలైలో టీఎంసీలో చేరారు. తరువాత గోవాను టార్గెట్‌ చేసింది. త్రిపుర విషయం వేరు, గోవాలో ఏమాత్రం ఉనికి లేని టీఎంసీలో మాజీ సీఎం ఫాలీరో చేరటం ఆశ్చర్యం కలిగించింది. అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు. దాంతో ఉన్నట్టుండి గోవా రాజకీయాల్లో టీఎంసీ కేంద్ర బిందువుగా మారిపోయింది. ఫాలిరో తర్వాత మరి కొందరు కాంగ్రెస్‌ నేతలు పార్టీ ఫిరాయించారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేష్‌పతి త్రిపాఠి, లలిత్‌పతి త్రిపాఠితో సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గత అక్టోబర్‌లో టీఎంసీలో చేరారు. వీరిలో ఒకరు మాజీ ఎమ్మెల్సీ కాగా, మరొకరు యుపి కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే. యూపీ మాజీ సీఎం కమలాపతి త్రిపాఠి మనవళ్లు వీరు. ఇక పెద్ద రాష్ట్రాల కోసం దీదీ దగ్గర భిన్నమైన వ్యూహాలు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా శక్తి వంతమైన రాజకీయ వేదిక నిర్మాణానికి భవిష్యత్‌లో శివసేన,ఎన్‌సీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం మమత వ్యూహంలో భాగం.మూడవ వ్యూహం కాంగ్రెస్‌ను లేకుండా చేయటం. మేఘాలయ, గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకోవడం బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సిద్ధంగా ఉందని యూపీఏ మిత్రపక్షాలకు సందేశం పంపారు . ఇటీవలి ఢిల్లీ పర్యటనలో సోనియా గాంధీని కానీ, రాహుల్ గాంధీని కానీ కలవ లేదు. ఉద్దేశపూర్వకంగానే ఆమె వారిని కలవలేదు. ఐనా కానీ 2024లో కాంగ్రెస్‌తో టీఎంసీ జతకట్టవచ్చు.. కానీ ఆ కలయిర దీదీ నిబంధనల ప్రకారమే ఉంటుంది.దీదీ దూకుడు చూస్తుంటే ఆమె నేల విడిచి సాము చేస్తుందనుకుంటాం. కానీ వాస్తవం ఏమిటో ఆమెకూ తెలుసు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని దీదీకి తెలియంది కాదు. కానీ, ఆమె లక్ష్యం బీజేపీని మెజార్టీకి దూరం చేయటం. ఆ తర్వాత మిత్రపక్షాలను కలుపుకోవటం. హెచ్‌డి దేవెగౌడ జనతాదళ్‌ పార్టీ 1996లో లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 46 సీట్లు గెలిచింది. అయినా ఆయన ప్రధాని పదవి చేపట్టారు. వామపక్షాల వైపు మొగ్గు చూపిన 119 మంది ఎంపీల మద్దతుతో పాటు ..140 మంది కాంగ్రెస్‌ ఎంపీలు నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అలాంటి పరిస్థితిని ఆశిస్తున్నారు.పశ్చిమ బెంగాల్‌ లోని 42 లోక్‌సభ స్థానాలకు గాను 2019ఎన్నికలలో టీఎంసీ 22 సీట్లు గెలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ముప్పయ్‌కి పైగా సీట్లు గెలుచుకోవచ్చు. ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకున్నా ఢిల్లీ పీఠం ఇంకా దూరమే. ఈ విషయం టీఎంసీకి తెలియంది కాదు. మరోవైపు, ఎంత నాయకత్వ సమస్యలతో సతమవుతున్నా 2024 ఎన్నికల్లో బీజేపీ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ నిలుస్తుంది. ఇందులో సందేహం లేదు. 2019లో కేరళలో గెలిచిన 15 సీట్లు, తమిళంలో సాధించిన 8 సీట్లను తిరిగి నిలబెట్టుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. 2024లో రాజస్థాన్‌ నుంచి కూడా మెరుగైన స్థానాలు ఆశిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ దానికి శూన్య హస్తమే లభించింది. కాబట్టి 2024లో ఎన్ని గెలిచినా బోనసే.పెద్ద రాష్ట్రాలలో టీఎంసీ,కాంగ్రెస్ ఒకే సమస్యను ఎదుర్కొంటున్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా వాటికి ఎక్కువ స్థానాలు దక్కవు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడుకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర పెద్ద రాష్ట్రాల్లో బీజేపీతో కాంగ్రెస్‌ ప్రత్యక్ష పోరు సాగిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్కదానిలోనూ టీఎంసీ బలమైన పోటీదారు కాదు. అది బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద జాతీయ పార్టీగా టీఎంసీ అవతరించేందుకు తగినన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశాలను తగ్గిస్తుంది.2014 లోక్‌సభ ఎన్నికల్లో, కాంగ్రెస్‌కు 19.3 శాతం ఓటు షేర్‌ లభించింది. దానితో పోలిస్తే టీఎంసీ ఓటు షేర్‌ 3.8 శాతం మాత్రమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ తన జాతీయ ఓట్ల శాతాన్ని 4.1 శాతానికి పెంచుకోగా కాంగ్రెస్ ఓట్ల శాతం 19.5 శాతానికి పెరిగింది.1996లో యునైటెడ్ ఫ్రంట్ తరపున ప్రధానమంత్రిగా జ్యోతి బసుకు అవకాశం వచ్చింది. కానీ సీపీఎం పొలిట్‌బ్యూరో ఈ ప్రతిపాదనకు మోకాలడ్డింది. మమత నాటి పరిణామాలను చాలా దగ్గరగా పరిశీలించారు. 2024 ఎన్నికల తరువాత చర్చల సమయంలో ఈ అనుభవం ఆమెకు ఉపయోగపడుతుంది. బీజేపీతో ప్రత్యక్ష పోటీలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పటిష్టంగా ఉంటే జ్యోతిబసు వ్యూహం ఫలిస్తుంది. అది బిజెపి సంఖ్యను తగ్గించి కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ సీట్లను పెంచుతుంది.నాడు దేవెగౌడ చేసినట్లుగానే కేంద్రంలో అధికారం సాధించాలనే తపనతో బెనర్జీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, టీఎంసీ నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇవ్వడానికి ప్రాంతీయ శక్తులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఐతే ఇలా జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది ప్రశ్న. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది, అలాగే రాహుల్-మమత మధ్య సంబంధాలపై అది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికీ ఎప్పుడూ పొసగలేదు. ఈ నేపథ్యంలో టీఎంసీ-యూపీఏ కూటమి మనుగడలోకి రాకముందే కనుమరుగు కావచ్చు.మరోవైపు, బీజేపీ కూడా సంతోషించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది తన రాజకీయ మూలధనాన్ని కోల్పోతుంది. వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గటం, అంత కుముందు భూసేకరణ బిల్లుపై తిరోగమనంతో దాని సంస్కరణవాద ఆధారాలను తగ్గించింది. కార్మిక సంస్కరణలు నిస్పృహలో ఉన్నాయి. ప్రత్యక్ష పన్ను కోడ్‌పై హై-పవర్ కమిటీ చేసిన సిఫార్సులు సమాధయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణం, ఉద్యోగ వృద్ధి కూడా నిరాశాజనకమే. ఐనా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బలమైన అస్త్రాలు ఉన్నాయి. కుళాయి నీరు, విద్యుత్తు, పారిశుధ్యం, గృహనిర్మాణం, డిజిటలైజేషన్, ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ సత్ఫఫలితాలు ఇస్తున్నాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆ పార్టీకి అదనపు బలం.మరోవైపు, ఇటు మమతకు అటు రాహుల్ గాంధీ ఇద్దరి టార్గెట్‌ ముస్లింలే. మైనారిటీ ఓట్లు లేకుండా పశ్చిమ బెంగాల్‌కు మమత ముఖ్యమంత్రి కాలేరు . అలాగే వాయనాడ్ నుంచి గాంధీ ఎంపీ అవరు. టీఎంసీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, ఇతర ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తు అనేది సిద్ధాంతపరమైన అవకాశం. అది ఆచరణలోకి రాకముందే కూలిపోవచ్చు.ఇదిలావుంటే, మమతా బెనర్జీ రెండు రోజుల ముంబై పర్యటన విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్‌ కలిసి రాకుండా బీజేపీని అధికారానికి దూరం చేయటం అసాధ్యమని శివసేన, ఎన్సీపీ తమ వైఖరిని స్పష్టం చేశాయి. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్‌ ఏర్పాటుకు అన్ని ప్రతిపక్షాలు కలిసి రావాలని అంటున్నాయి.మమతా బెనర్జీ వ్యూహాలు బాగానే ఉన్నాయి. కానీ ఒక్కోసారి ఫలితాలు అశించిన విధంగా ఉండవు. వ్యూహం బెడిసితే అది బీజేపీకి వరంగా మారుతుంది. ప్రతి పక్షాలు తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతింటాయి. అందుకు బాధ్యులుగా దీదీ ఆ భారాన్ని మోయవలసి ఉంటుంది. మరి ఆమె ఈ విషయం గుర్తిస్తారా!!

Related Posts