రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దేశం ఒక గొప్ప అనుభవజ్ఞుడైన నాయకున్ని కోల్పోయింది గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం,
తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.రోశయ్య మృతితో దేశం ఒక గొప్ప అనుభవజ్ఞుడైన నాయకున్ని కోల్పోయిందని గవర్నర్ అన్నారు. వారి మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని గవర్నర్ అన్నారు.రాజకీయాలలో, ప్రజాజీవనంలో రోశయ్య అత్యున్నత ప్రమాణాలు పాటించారని, వారి ఆదర్శాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని గవర్నర్ తెలిపారు.
అంకితభావం, నిబద్ధత రోశయ్య స్వంతం భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సంతాపం,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపట్ల భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన పరమపదించారని తెలిసి ఎంతో విచారించానన్నారు. తెలుగు రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ అంకితభావం, నిబద్ధతతో ముందుకు సాగిన రోశయ్య ఆదర్శప్రాయులుగా నిలిచారని కొనియాడారు. ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి, ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, వివిధ శాఖలకు రాష్ట్ర మంత్రిగా ప్రజాసమస్యల విషయంలో రోశయ్య నిరంతర పోరాటం చేశారని వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. ఓర్పు, నేర్పుతో తాను చేపట్టిన పదవులను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. తమిళనాడు గవర్నర్‌గా హుందాగా వ్యవహరించారని పేర్కొన్నారు. రోశయ్య తనకు చిరకాల మిత్రుడని, సర్వజన హితాభిలాషి, చక్కని వక్త అని, వివిధ అంశాలపై స్పష్టమైన విషయ పరిజ్ఞానం, ప్రసంగాల్లోనూ ఎవరినీ నొప్పించకుండానే విషయాన్ని సూటిగా, స్పష్టంగా తెలియజేయటంలో సిద్ధహస్తులుగా గుర్తింపు పొందారన్నారు. 16సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత వారికి దక్కిందని, మంచి వక్తృత్వం, చక్కటి వ్యక్తిత్వంతో నిగర్విగా, నిరాడంబరంగా జీవించిన రోశయ్య ఇకలేరనే వార్త బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని వెంకయ్యనాయుడు తన సంతాప సందేశంలో తెలిపారు.
రోశయ్య మృతి పట్ల తమిళనాడు గవర్నర్, సీఎం సంతాపం,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్విట్టర్ ద్వారా రోశయ్య మృతికి సంతాపం తెలిపారు. రోశయ్య మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్ రవి పేర్కొన్నారు. ఆయన గొప్ప రాజకీయ నాయకుడని, సుదీర్ఘ కాలం చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారని కొనియాడారు. రోశయ్య మరణం దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని లోటు అని ట్వీట్ చేశారు.రోశయ్య ఆత్మకు శాంతి కలుగాలని గవర్నర్ రవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోశయ్య మరణవార్త వినగానే తనకు చాలా బాధ కలిగిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. రోశయ్య మంచి అనుభవశాలి అయిన నాయకుడని, మేధావి అని స్టాలిన్ కొనియాడారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.