అమరావతి డిసెంబర్ 4
జవాద్ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం గంటకు 6 కి.మీ. వేగంతో పయనిస్తున్నట్లు వారు చెప్పారు. తుఫాన్‌ను సమర్ధంతగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అధికారులను సన్నద్ధం చేసింది. పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని ప్రజలకు మంత్రి ముట్టంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. కాగా, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో విషాదం చోటుచేసుకున్నది. ఈదురుగాలులు బలంగా వీస్తుండటంతో కొబ్బరిచెట్టు విరిగిపడింది. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న బాలికపై కొబ్బరిచెట్టు పడటంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతిచెందింది.
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జవాద్ తుఫాన్ విశాఖకు ఆగ్నేయంగా 210 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. సాయంత్రానికి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. రేపు మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో వాయుగుండంగా బలహీనపడే సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఒడిశాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుపాను రక్షణ చర్యల్లో భాగంగా.. విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే 3 ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. జీవీఎంసీ పరిధిలో 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తుపాను తీవ్రత దృష్ట్యా పాఠశాలలకు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు.