విశాఖపట్టణం, డిసెంబర్ 4,
:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చాణిక్యుడిగా పేరుగాంచిన కొణిజేటి రోశయ్య నేడు అనారోగ్యంతో మరణించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శనీయం. రాజకీయ చతురుడుగా పేరుపొందిన రోశయ్య మరణంతో కాంగ్రెస్ పార్టీ తో పాటు ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రోశయ్య ఏకైక కుమార్తె రమాదేవి నివసిస్తున్న విశాఖ పట్నం బాలాజీనగర్లోని ఆమె కుమార్తె నివాసం వద్ద విషాదం ఛాయలు నెలకొన్నాయి. తన తండ్రి మరణంపై రమాదేవి స్పందిస్తూ.. ఇంట్లో రాజకీయాలను ప్రస్తావించేవారు కాదు.. తమని విలువలతో పెంచారని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నత పదవులను అధిరోహించిన తన తండ్రి ఎప్పుడూ హోదా ని ప్రదర్శించలేదని.. ఎంతో సింపుల్ గా జీవించేవారని గుర్తు చేసుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో తన తండ్రి రోశయ్యకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తన తండ్రికి చెడ్డపేరు రాకుండా జీవించాలని తన తండ్రి కోరుకున్నారని.. అందుకనే తాము రాజకీయాల్లో రాలేదని చెప్పారు రమాదేవి. ముఖ్యమంత్రి ఎవరైనా వారికీ నచ్చే విధంగా పనిచేస్తూ.. మంచి పేరు తెచ్చుకున్నారు.తన తండ్రి లేని లేటు తమకు తీరదని తండ్రిని గుర్తు చేసుకుంటూ రమాదేవి కన్నీరు పెట్టుకున్నారు. ఆయన తమకు తీరని లోటని పేర్కొన్నారు. అమ్మా నాన్నలకి తాను ఒక్కర్తినే కూతుర్ని కావటంతో చాలా ముద్దుగా పెంచారంటూ కన్నీరు పెట్టుకున్నారు. నన్ను నాన్న కూతురని అంటారు. నాన్నకు నా వంట అంటే చాలా ఇష్టమని తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఆరేళ్ల వయసులో ఉండగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారని .. అయితే ఎప్పుడూ తన తండ్రి రోశయ్య ఇంట్లో రాజకీయాల ప్రస్తావన తెచ్చేవారు కాదని .. తమను చిన్నప్పటి నుండి మమ్మల్ని విలువలతో పె౦చారని చెప్పారు. తండ్రిని కడసారి చూసేందుకు కుమార్తె రమాదేవి, అల్లుడు పైడా కృష్ణప్రసాద్ లు విశాఖ పట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరారు.