ఏలూరు, డిసెంబర్ 6,
వర్షాలతో పాటే వ్యాధుల సీజన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో కిల్లర్ ఫీవర్స్ దడ పుట్టిస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలను జ్వరాలు వణికిస్తున్నాయి. వచ్చింది జ్వరమో, కరోనాయో తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలు గ్రామా ల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల అంతుచిక్కని జ్వరాలతో ఆసుపత్రులపాలవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది అప్రమత్త మైనా ఇంకా వ్యాధులు ప్రబలకుండా ప్రజారోగ్యశాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో అంతుచిక్కని జ్వరాలు అల్లాడిస్తున్నాయి. ఎలా వస్తుందో… ఎందుకొస్తుందో తెలియని విష జ్వరాలతో గ్రామం మొత్తం మంచాన పడింది. ఎక్కువగా విద్యార్ధులే బాధితులుగా మారుతున్నారు. దాదాపు 50మందికి పైగా స్కూల్ స్టూడెంట్స్ డేంజర్ ఫీవర్స్ బారినపడ్డారు. ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొదట నార్మల్ ఫీవర్‌గానే మొదలవుతోంది. సాధారణ జ్వరమే కదా.. అనుకునేలోపే విశ్వరూపం చూపిస్తోంది. తమకొచ్చింది ఏ జ్వరమో తెలుసుకోకుండా బాధితులు.. స్ఠానికంగా అందుబాటులో ఉన్న క్లినిక్‌లను ఆశ్రయిస్తుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఒక పక్క కరోనా భ యం వెంటాడుతుండగా మరో పక్క విషజ్వరాలు విజృంభించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గ్రామాల్లో అధికశాతం మంది జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో కొంతమంది ఇళ్లల్లోనే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. గ్రామాల్లో అనేక చోట్ల పీహెచ్‌సీలకు ప్రతి రోజు వైరల్ జ్వరాల చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పీహెచ్‌సీలకు ఎక్కువగా జ్వరపీడితులు వస్తున్నారని వైద్యాధికారులు తెలిపారు.వాతావరణంలో చోటు చేసుకున్న పలు మార్పులు కారణంగా విష జ్వరాలు ప్రబలుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు, మంచినీళ్లు కలుషితం కావడం, శానిటేషన్ సరిగా లేకపోవడంతోనే పిల్లలు విషజ్వరాల బారిన పడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఈ క్రమంలో గ్రామస్తుల వత్తిడితో అధికారులు వాటర్ ట్యాంకు శుభ్రం చేశారు. ఇప్పటికే శానిటేషన్ పనులు ప్రారంభించారు. అంతేకాక మంచినీటి నమూనాలను సేకరించి టెస్ట్ పంపించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని విష జ్వరాలు తగ్గుముఖం పట్టాయని చిన్నపాటి అనారోగ్య సమస్యలు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు.