తిరుపతి, డిసెంబర్ 6,
ఏపీలో జరిగిన రెండో విడత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ విశ్లేషణ చేస్తోంది. మరి.. కుప్పంలో ఓటమిపై చంద్రబాబు పోస్టుమార్టం చేస్తారా? ఆ దిశగా ఆలోచన ఉందా? పార్టీ ఆఫీస్‌కు వస్తున్న తమ్ముళ్లు వేస్తున్న ప్రశ్నలేంటి?మొదటి విడతలో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడంతో ఆ ఫలితాలపై విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదని భావించింది టీడీపీ. రెండో విడతలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పార్టీ అన్ని ఎఫర్ట్స్ పెట్టింది. గట్టిగా పోరాడే ప్రయత్నం చేసింది. దీనికి తగ్గట్టే రెండు మున్సిపాల్టీలను చేజిక్కించుకుంది. గతంతో పోల్చుకుంటే వైసీపీని బాగానే ఎదుర్కొన్నామనే ఫీలింగ్ పార్టీ వర్గాల్లో కనిపించింది. కాకపోతే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో.. ఓవరాల్‌గా టీడీపీ ఘోరంగా ఓడిపోయిందనే చర్చ జరిగింది. ఈ క్రమంలో రెండో విడత ఎన్నికల్లో స్థానిక నేతల పని తీరు.. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిపై విశ్లేషణ మొదలుపెట్టింది టీడీపీ. అధినేత చంద్రబాబు స్వయంగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తలు, నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు కూడా. ఈ సందర్భంగా ఆయన కొన్ని సలహాలు.. సూచనలు చేస్తున్నారు. రెండు రోజులుగా ఏపీ టీడీపీ ఆఫీసులో ఇదే తంతు కొనసాగుతోంది. ఈ విశ్లేషణలు అన్నింటికంటే.. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై పోస్ట్‌మార్టం చేస్తున్నారా? లేదా అని ఆరా తీస్తున్నారట.కుప్పం మున్సిపాల్టీలో 25 వార్డుల్లో 19చోట్ల వైసీపీ గెలుచుకుంది. టీడీపీకి దక్కింది ఆరు వార్డులే.ఆ ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. దీంతో తన నియోజకవర్గంలో ఓటమికి చంద్రబాబు ఎవరిని తప్పు పడతారు? ఎవర్ని బాధ్యులను చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ప్రత్యర్థి ఎన్ని కుట్రలు పన్నినా గెలవాలనే సంకల్పం, పట్టుదల ఉంటే గెలవొచ్చని గురజాల, దాచేపల్లి మున్సిపల్ విశ్లేషణల సందర్భంగా చంద్రబాబు కార్యకర్తలకు.. నేతలకు దిశా నిర్దేశం చేశారట. ఈ క్రమంలో అదే ఫార్మూలాను కుప్పానికి ఎందుకు అప్లై చేయలేదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందట.కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణాల్లో అధికార పార్టీ బలం.. అధికారుల సహకారం.. డబ్బుల పంపిణీ.. దొంగ ఓటర్ల తరలింపు అని ఎన్ని విమర్శలు చేసినా.. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వీటిని చేధించలేనంత నిస్సహయతలో పార్టీ.. పార్టీ నేతలు ఉన్నారా..? అంటే ముఖ్య నాయకుల్లో మాత్రం మౌనమే సమాధానంగా వస్తోంది. అయితే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఆ పార్టీ చెప్పే కారణాల సంగతేమో కానీ.. అంతకు మించిన లోపాలు పార్టీపరంగా కుప్పంలో చాలా ఉన్నాయనే అంటున్నారు. స్థానికంగా పార్టీ నేతలు.. ఎవర్ని అయితే ఇన్ఛార్జులుగా నియమించి చంద్రబాబు బాధ్యతలు అప్పజెప్పారో వాళ్లే ఓటమికి ప్రధాన కారణమనే చర్చ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతోందట.ఈ అంశాలను ప్రభావితం చేసేలా వైసీపీ లోపాయికారీగా ప్రచారం చేయడం వల్ల కూడా కుప్పంలో ఓడిపోయామనే భావన వ్యక్తం అవుతోందట. ఇన్ఛార్జులుగా బాధ్యతలు తీసుకుని.. ఇష్టానుసారం వ్యవహరించిన ఓ ఐదుగురు నేతల ఓవరాక్షన్.. వారి వ్యవహర శైలి వల్లే పరిస్థితి చేజారిందనే చర్చ ఉందట. స్థానిక నేతల వ్యవహారం చంద్రబాబు తెలియజేయాలంటే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తేనే బెటరని చాలామంది భావించినట్టు సమాచారం. ఎలాగూ ఆ ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయడం లేదు కదా.. సాధారణ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేసుకోవచ్చనే భావన కలిగేలా.. రాజకీయం జరిగిందని టాక్. ఆ క్రమంలో కుప్పం ఓటమికి బాధ్యులైన ఆ ఇన్ఛార్జుల విషయంలో చంద్రబాబు ఏం మాట్లడతారు..? వారిని తప్పించి వేరే ఎవరికైనా బాధ్యతలు అప్పజెబుతారా..? లేదా పాత విధానాన్నే కంటిన్యూ చేస్తారా..? అనేది చూడాలి.