తిరుమల, డిసెంబర్ 6,
కలియుగ వైకుంఠం తిరుమలలో భారీవర్షాలు అపార నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. తిరుమల కొండకు వెళ్ళే రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు ఐఐటీ టీం. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించడం, అవి విరిగి పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం నిర్మాణం అంశాలపై నివేదిక సమర్పించనుంది ఐఐటీ బృందం. తిరుమల ఘాట్ రోడ్డులో 10 సంవత్సరాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి.పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరమే తదుపరి చర్యలపై నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రస్తుతం లింక్ రోడ్డు మీదుగా ట్రాఫిక్ మళ్ళించే అంశం పై దృష్టి సారించామన్నారు. మోకాలి మిట్ట నుంచి జియన్ సి వరకు సమాంతరంగా రోడ్డు నిర్మించే అంశాన్ని టీటీడీ దృష్టికి తీసుకువెళతాం అన్నారు రామచంద్రారెడ్డి. తిరుమలలో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించామన్నారు ఐఐటీ నిపుణుడు కేయస్ రావు.తుఫాను ప్రభావంతో ఊహించని విధంగా వర్షం కురవడంతో 40 నుంచి 50 టన్నులు బరువు వున్న బండరాలు జారిపడ్డాయన్నారు. రెండు మూడు నెలల కాలంలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామన్నారు. తిరుమల వెళ్ళే దారిలో 12 ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే అవకాశాలు వున్నాయని గుర్తించామన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు పటిష్టంగానే వుందని, రాక్ ఫాల్స్ కారణంగానే రోడ్డు డ్యామేజి జరిగిందన్న నిర్దారణకు వచ్చారు. భవిష్యత్త్ అవసరాలు దృష్టిలో వుంచుకుని ప్రత్యామ్నాయంగా మరో రోడ్డు నిర్మాణం చెయ్యాలని సూచిస్తామని ఐఐటీ నిపుణులు చెప్పారు. వీరి సూచనలతో తిరుమల ఘాట్ రోడ్డు భద్రతా పరంగా పటిష్టంగా మారాలని భక్తులు కోరుకుంటున్నారు.