YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆరు తడి పంటలతో పల్లెలు కళకళ

ఆరు తడి పంటలతో పల్లెలు కళకళ

అదిలాబాద్, డిసెంబర్ 6,
నిర్మల్‌ జిల్లాలో శ్రీరాంసాగర్‌ పునరావాస గ్రామాలైన వెల్మల్‌, బొప్పారం, కూచన్‌పెల్లి రైతులు ఏడాదికి మూడు పంటలు తీస్తూ ఆర్థిక లబ్ధి పొందుతూ, భూగర్భజలాలను కాపాడుకుంటున్నారు. సోయా, వేరుశనగ, నువ్వులు పండిస్తూ, స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మరోవైపు విత్తనాలు వేయడం మొదలుకొని పంట తీసే దాకా ఏడాదంతా వ్యవసాయ కూలీలకు పని కల్పిస్తున్నారు. వరికి బదులు ఇతర పంటలు వేసుకోవాలని ప్రభుత్వం చెబుతుండగా, ఇప్పటికే ఈ మూడు గ్రామాలు ఆ దిశగా అడుగులు వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.సోన్‌ మండలంలోని న్యూవెల్మల్‌, బొప్పారం, కూచన్‌పెల్లి గ్రామాలు ఆరుతడి పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. శ్రీరాంసాగర్‌లో తమ పంట భూములు ముంపునకు గురి కావడంతో సోన్‌ మండలంలోని వెల్మల్‌ బొప్పారం, కూచన్‌పెల్లి గ్రామాలు పునరావాస గ్రామాలుగా ఏర్పాటయ్యాయి. ఈ గ్రామ రైతులు ప్రధానంగా శ్రీరాంసాగర్‌ సరస్వతీ కెనాల్‌ ద్వారా వచ్చే నీటిని వినియోగించుకుంటారు. ఏడాదికి మూడు పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సోన్‌ మండల కేంద్రానికి కిలోమీటర్‌ దూరంలో కూచన్‌పెల్లి గ్రామం ఉండగా… మరో రెండు కిలోమీటర్ల దూరంలో వెల్మల్‌, బొప్పారం జంట గ్రామాల రైతులు సోయా, వేరుశనగ, నువ్వులు సాగు చేస్తూ ఆర్థికంగా లాభాలను ఆర్జిస్తున్నారు. గ్రామంలో సుమారు వెయ్యి మంది రైతులు తమకున్న పంట పొలంలో వానకాలం సీజన్‌లో సోయా విత్తనాలను వేసుకుంటారు. జూన్‌ మాసంలో విత్తనం విత్తగా, సెప్టెంబర్‌ మాసానికి పంట చేతికి వస్తుంది. అక్టోబర్‌లో రెండో పంట కింద వేరుశనగను సాగు చేస్తారు. ఆ పంట ఫిబ్రవరి నాటికి చేతికి వస్తుంది.ఆ తర్వాత నువ్వు పంటను ఫిబ్రవరిలో వేసుకోగా.. మేలో చేతికొస్తున్నది. ఈ మూడు పంటలకూ తక్కువ నీరే అవసరం ఉండడంతో, రైతులు డ్రిప్‌ ద్వారా సాగు చేస్తున్నారు. ఈ వానకాలం సీజన్‌లో రైతులు సుమారు 750 ఎకరాల్లో సోయా సాగు చేశారు. అది చేతికి రావడంతో ప్రస్తుతం వేరుశనగ వేశారు. ఈ పంట కూడా ఏపుగా పెరిగి పూత, కాత దశకు చేరుకుంది. సోయా ఎకరానికి 5 నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్లో సోయా ధర ఇప్పుడు రూ. 5,500 ఉండగా, ఎకరానికి రూ. 35 వేల ఆదాయం వస్తున్నది. ఇందులో ఖర్చు రూ. 15వేలు పోనూ రూ. 20వేలు లాభం వస్తుంది. అక్టోబర్‌లో వేరుశనగ విత్తనాలను తీసుకొచ్చి పంట సాగు చేయడంతో జనవరి చివరి మాసంలో పంట చేతికి వస్తున్నది. ఇక్కడి రైతులు పచ్చి వేరుశనగను స్థానికంగానే కాకుండా, డిమాండ్‌ ఉన్న ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తారు.ఇతర ప్రాంతాల్లో కంటే ముందుగానే పంట తీయడంతో మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. పచ్చి పల్లికాయను స్థానిక మార్కెట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలిస్తారు. క్వింటాల్‌కు రూ. 4 వేల నుంచి రూ.5 వేల వరకు ధర వస్తున్నదని రైతులు చెబుతున్నారు. మిగిలిన పల్లిని ఇక్కడే ఆరబోసి ఇంటి వద్దనే నిల్వ ఉంచి చిరువ్యాపారులకు విక్రయిస్తారు. ఆరబెట్టిన పల్లి క్వింటాలుకు రూ. 9వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తుండడంతో చిరు వ్యాపారులు దాన్ని తిరిగి కిలోకు రూ. 120 చొప్పున గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. వేరు శనగ పంట ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా.. మార్కెట్లో రూ. 10వేల ధర పలకడంతో రూ. 60వేల నుంచి రూ. 70వేల వరకు ఆదాయం వస్తున్నది. వేరుశనగ పంటకు ఖర్చులు అధికమైనప్పటికీ దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. పదిహేనేళ్ల నుంచి న్యూవెల్మల్‌, బొప్పారం, కూచన్‌పెల్లి గ్రామానికి చెందిన రైతులు ఇదే రీతిలో పంటను సాగు చేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో నువ్వు పంటను విత్తుకోగా.. మే మొదటి వారంలో పంట చేతికి వస్తున్నది. నువ్వు పంటకు కేవలం మూడు తడులు మాత్రమే నీటి అవసరం ఉంటుంది. ఇక్కడి రైతులు జగిత్యాల, నిర్మల్‌కు చెందిన స్థానిక నువ్వుల విత్తనాలను వేసుకోవడంతో ఎకరానికి 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నాయి. మార్కెట్లో నువ్వుల ధర రూ. 10వేల వరకు ఉండగా రూ. 30వేల ఆదాయం వస్తున్నది. ఖర్చులు మాత్రం రూ. 10వేలలోపే అవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గుతుంది. ఏడాదిలో మూడు పంటలు సాగు చేయడం వల్ల సోయా, వేరుశనగ, నువ్వు ఆకులు భూమిపై రాలి సేంద్రియ ఎరువుగా మారుతున్నదన్నారు. భూసారాన్ని పెంచేందుకు ఈ ఆరుతడి పంటలు ఎంతగానో ఉపయోగపడు తున్నాయని రైతులు పేర్కొంటున్నారు.

Related Posts