మెదక్, డిసెంబర్ 6,
మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, వివేకానంద, సెవెన్ వండర్స్‌లో ఇఫిల్ టవర్, తాజ్‌మహల్,సౌర కుటుంబం, శరీర భాగాలు, ఆంగ్లంలో రోజులు, ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రపంచ పటం, వర్ణమాల, ప్రాక్షన్స్, ఇండియా, జంతువులు ఇలా విద్యార్థులకు పాఠ్యాంశాల్లో వచ్చే ప్రతీది చిత్రాల రూపంలో గోడలపై వేయడంతో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా చదువుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా గజ్వేల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపును సంతరించుకున్నాయి. ప్రాథమిక పాఠశాల చిన్నారుల్లో ఆసక్తిని అభ్యసన సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పాఠశాలల్లోని గోడలపై వేసిన వివిధ రకాల బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలకు వస్తే అక్కడి వాతావరణాన్ని చూసి మైమరిచిపోతున్నారు. ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడంతో పాటు పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచుతూ అభ్యసనానికి దోహదపడుతున్నాయి.గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యపై ఆసక్తిని పెంచడం, అభ్యసన సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు బడులను గడిచిన ఏడున్నరేండ్ల కాలం లో సరికొత్తగా తీర్చిదిద్దింది. రూర్బన్ పథకం కింద ప్రాథమిక , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో పాఠ్యాంశాల్లోని బొమ్మలను గోడలపై వేయడంతో కొత్తగా వాతావరణం కనిపిస్తున్నది. ప్రధానంగా గోడలపై విద్యార్థులు ఎప్పుడు గుర్తించుకునేలా ఉండే బొమ్మలను వేయించారు. ప్రతిరోజూ వాటిని అధ్యయనం చేయడంలో మరిచిపోలేని విధంగా పాఠ్యాంశాలు ఉంటాయి. ఇలా ప్రతి పాఠశాల గోడలపై బొమ్మలు వేయడంతో కార్పొరేట్ పాఠశాలలను తలపించేలా కనిపించడంతో విద్యార్థులు ఎక్కువగా సర్కారు పాఠశాలల్లో చదువుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గోడలపై వేసిన బొమ్మలతో విద్యార్థులు చదివింది ఎప్పటికికీ గుర్తుండేలా దోహదపడుతున్నాయి. ప్రాథమిక పాఠశాల దశలోని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పై తరగతుల్లో కూడా మరిచిపోలేని విధంగా ఉండేలా తెలుగు, హిందీలో వర్ణమాల, శరీర భాగాలు, ప్రపంచ పటం, ఇండియా పటం, సెవెన్ వండర్స్, ఇండియాలో ముఖ్యమైన ప్రదేశాలు ఇలా ఎన్నో బొమ్మలను వేశారు. దీంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.