హైదరాబాద్, డిసెంబర్ 6, టీఆర్‌ఎస్ నేత బండ ప్రకాష్ రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామా లేఖను బండ ప్రకాశ్ సమర్పించారు. ఇటీవలే బండ ప్రకాశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. వరంగల్‌లో 1954 ఫిబ్రవరి 18న జన్మించారు బండప్రకాశ్. ఎంఏ, పీహెచ్‌డీ చేశారు ప్రకాష్. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నుండి 1996లో పి.హెచ్.డి పట్టా పొందారు.తెలంగాణలోని పలు సామాజిక, స్వచ్ఛంద సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా సనిచేశారు. వరంగల్ పురపాలక సంఘం ఉపాధ్యక్షునిగా కూడా ఆయన పనిచేశారు. ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడైన ఆయన 2017లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. 2018 మార్చి 23న టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 జూన్ లో పార్టీ పార్లమెంటరీ సమావేశంలో టిఆర్ఎస్ పక్ష ఉప నాయకుడిగా బండ ప్రకాష్ ని ని నియమించారు కేసీఆర్. పార్టీ అధినేతకు బండ ప్రకాష్ వీరవిధేయుడిగా వున్నారు.ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తనను రాష్ట్ర రాజకీయాలకు తీసుకురావాలని కేసీఆర్ భావించారని, అందుకే రాజ్యసభ నుంచి తెలంగాణలోని పెద్దల సభకు వస్తున్నానన్నారు బండ ప్రకాష్. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు స్థానం దక్కింది.ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నా, రాజ్యసభ ఎంపీగా వున్న వ్యక్తిని శాసనమండలికి రప్పించడం వెనుక కేసీఆర్ వ్యూహం ఏదో వుందనే చర్చ సాగుతోంది. బండ ప్రకాష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని టాక్ వినిపిస్తోంది. అందుకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని ముదిరాజ్ సామాజిక వర్గ నేతలు ఆశాభావంతో వున్నారు. ఈటల రాజేందర్ కు మంత్రివర్గంనుంచి ఉద్వాసన పలకడంతో సామాజిక సమీకరణాల్లో భాగంగా బండ ప్రకాష్ కి మంత్రిమండలిలో బెర్త్ లభించవచ్చని అంటున్నారు