YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖమ్మంలో ఎక్కడి చెత్త అక్కడే

ఖమ్మంలో ఎక్కడి చెత్త అక్కడే

ఖమ్మం నగరపాలకంలో అభివృద్ధి కుంటుపడింది. ప్రజల అవస్థలు పెరిగాయి. అయినా పరిస్థితి మారడంలేదు. పాలకవర్గం సభ్యులు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు చొరవచూపక, వారికి కార్యనిర్వాహకవర్గం నుంచి సహకారం అందక పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల జరిగిన సంఘటనలే దీనికి నిదర్శనం. విధులకు సరిగా హాజరుకాని సిబ్బందిపై చర్యలు తీసుకునే అధికారం పాలకవర్గానికి లేదు. దీంతో కొంతమంది సిబ్బంది పాలకవర్గ సభ్యులను పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలకంలో సాధారణ సమావేశంతోపాటు, పౌరసేవలపై సమీక్షించే అధికారం పాలకవర్గానికి ఉంది. అయితే ప్రస్తుతం పాలకవర్గం ఆవైపుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైతే వారితో సమీక్షా సమావేశాలు నిర్వహించి వాటిని నిబంధనలకనుగుణంగా పరిష్కరించే అవకాశం ఉంది. అయితే నేటి వరకు ఆవైపుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తమ సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉంటుందో.. ఉండదో అన్న అనుమానంలో నగరప్రజలు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పరిస్థితులను చక్కదిద్ది, పాలకవర్గం, సిబ్బందికి మధ్య సమన్వయాన్ని కల్పించి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రూ.14కోట్లతో చేపట్టాల్సిన నగరపాలక సంస్థ భవన నిర్మాణ పనులు నేటికీ ప్రారంభించలేదు. మరోవైపు పాత కార్యాలయానికి మరమ్మతులు, ఇతర వసతుల కల్పన పేరిట రూ.లక్షలు వెచ్చించారు. వీటన్నింటిని సమీక్షించాల్సిన  పాలకవర్గం అచేతన స్థితిలో ఉందా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం పనులు చేస్తున్నప్పటికీ నిర్దేశిత సమయంలో దరఖాస్తుదారులకు సరైన సమాచారం ఇవ్వడం, అవసరమైన పత్రాలు తీసుకొని పనులు చేయాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకపోవడం శాపంగా మారింది. ప్రజల మౌలిక వసతులపై దృష్టి సారించకుండా,సిటిజన్ చార్జర్ కార్యనిర్వాహక విభాగం మూలన పడేసినప్పటికీ పాలకవర్గం చోద్యం చూస్తోంది.నగరంలో రోజుకు 150 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. చెత్తను తరలించేందుకు ఏటా ప్రైవేటు ట్రాక్టర్లను అద్దెకు తీసుకొని వాటి ద్వారా చెత్తను తరలిస్తారు. అయితే ఈ ఏడాది ప్రైవేటు ట్రాక్టర్లు ఏర్పాటు చేసేందుకు టెండర్లు నిర్వహించే ప్రక్రియ  27తో ముగిసింది. కాంట్రాక్టర్లు టెండర్లు వేసేందుకు ముందుకు రాకపోవడంతో ఈనెల ఒకటి నుంచి ప్రైవేటు ట్రాక్టర్లు నిలిచిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో చెత్త గుట్టల్లా పేరుకుపోయింది. ఆగ్రోస్‌ కంపెనీ ద్వారా ట్రాక్టర్‌లు కొనుగోలు చేసేందుకు స్థాయి సంఘం అజెండాలో రూపొందించి, ఈ నెల 5న సమావేశం ఏర్పాటు చేసినా పాలకవర్గ పెద్దలు, అధికారులు ఎవరూ ఆ రోజున లేకపోవడంతో అది కాస్తా వాయిదా పడింది. దీంతో ఇప్పట్లో వాహనాలు కొనుగోలు చేసే అవకాశం లేకుండాపోయింది.

Related Posts