ఏలూరు, డిసెంబర్ 7,
పోలవరం 2022 ఏప్రిల్ నాటికి పూర్తి కావడం కష్టమేనని.. ఎన్నో కారణాల వల్ల పనుల్లో ఆలస్యమవుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ప్రాజెక్ట్‌లో నీటి పారుదల పనులకు మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2022 నాటికి పోలవరం పూర్తి కావడం కష్టమేనంటూ అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రతినెలా పనులను రివ్యూ చేస్తున్నా కరోనా వల్ల పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని కేంద్రం పేర్కొంది. సహాయ, పునరావాస కార్యకలాపాల్లో ఆలస్యం కూడా కారణమని స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో రిటన్‌గా ఆన్సర్ ఇచ్చారు జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్. పోలవరంలో స్పిల్‌వే, అప్‌స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, కాంక్రీట్ డ్యామ్ -గ్యాప్ 3, డయాఫ్రమ్ వాల్ ఆఫ్ ఎర్త్ కమ్ రాక్–ఫిల్ డ్యామ్ వంటి కీలక భాగాల నిర్మాణం ఇప్పటికే పూర్తయినట్లు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. స్పిల్‌వే రేడియల్ గేట్లు 88%, స్పిల్ ఛానెల్ 88%, అప్రోచ్ ఛానల్ ఎర్త్‌వర్క్ 73%, పైలట్ ఛానెల్ పని 34%, పవర్ హౌస్ పునాది తవ్వకం 97% పూర్తయినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.ప్రాజెక్ట్‌ని పూర్తి చేయడానికి వచ్చే ఏడాది ఏప్రిల్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పనుల ప్రస్తుత స్థితి షెడ్యూల్‌కు అనుగుణంగా ఉన్నట్లు కనిపించట్లేదని స్పష్టం చేశారు. కరోనా, ఎర్త్ కమ్ రాక్–ఫిల్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 పనులు, పునరావాస కార్యకలాపాలు పూర్తి చేయడంలో ఆలస్యం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. మరోవైపు ప్రాజెక్ట్‌లో నీటి పారుదల పనులకు మాత్రమే నిధులు ఇస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రాజెక్ట్ రెండవసారి సవరించిన అంచనా వ్యయం 55,548 కోట్లని, 2019 ఫిబ్రవరిలో సలహా సంఘం సమావేశంలో దీన్ని ఆమోదించినట్లు పేర్కొన్నారు. అయితే సవరించిన అంచనా వ్యయంలో కేవలం ఇరిగేషన్ విభాగానికి అయ్యే 35,950 కోట్లకు మాత్రమే రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆమోదం తెలుపుతూ మార్చి 2020న నివేదిక ఇచ్చిందని వివరించారు. దీనిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) తుది సిఫార్సుల అనంతరం ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ తీసుకుంటామని తన సమాధానంలో పేర్కొన్నారు.ఈ ఏడాది నవంబర్‌లో అప్‌డేట్ చేసిన ప్రాజెక్ట్ షెడ్యూల్‌ను సూచించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేశారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రతీ నెల నెలవారీగా ప్రాజెక్టు పనుల పురోగతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి నివేదిస్తోందని, 2019 జనవరి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు జరిగిన పనుల పురోగతిని కేంద్ర మంత్రి వివరించారు. హెడ్ వర్క్స్‌లో భాగంగా 245.62 లక్షల క్యూబిక్ మీటర్ భూమి పని, కట్ట పని, 12.83 లక్షల క్యూబిక్ మీటర్ కాంక్రీటు పని జరిగిందన్నారు. అంతేగాక కుడి ప్రధాన కాలువకు సంబంధించి 3.86 లక్షల క్యూబిక్ మీటర్ భూమి పని, 1.37 లక్షల క్యూబిక్ మీటర్ లైనింగ్, 0.42 లక్షల క్యూబిక్ మీటర్ నిర్మాణాలు జరిగాయని తెలిపారు. కాగా ఎడమ ప్రధాన కాలువ విషయంలో 13.90 లక్షల క్యూబిక్ మీటర్ భూమి పని, 0.48 లక్షల క్యూబిక్ మీటర్ లైనింగ్, 1.97లక్షల క్యూబిక్ మీటర్ నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రాజెక్టు కోసం 995.77 హెక్టార్లు భూసేకరణ జరగగా, 2,429 ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు వివరించారు.