ఏలూరు, డిసెంబర్ 7,
వైసీపీ నేతల మధ్య ఏదో ఒక వివాదం నిత్యం తెరమీదికి వస్తూనే ఉంది. ఒకటి వదిలితే.. ఒకటి పంచాయితీ గా మారి.. పార్టీ అధినేత, సీఎం జగన్‌కు తలనొప్పులు తెస్తూనే ఉంది. తాజాగా పశ్చిమ గోదావరిలో మరో విషయం వెలుగు చూసింది. త్వరలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతిపార్లమెంటు నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనతో పాటు మరికొన్ని కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఇక పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజనను పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తోన్న పరిస్థితి ఉంది.ధర్మాన ప్రసాదరావుతో మొదలు పెట్టి దక్షిణ కోస్తా, సీమ, రాజధాని జిల్లాల వైసీపీ నేతలు కూడా జిల్లాల విభజనపై తమ అభ్యంతరాలు తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరిలో నరసాపురం, ఏలూరు పార్లమెంటు స్థానాలు కొత్త జిల్లాలుగా ఏర్పడనున్నాయి. ఏలూరు కొత్త జిల్లా విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ, కొత్తగా ఏర్పడే నరసాపురం జిల్లా విషయంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కూడా పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నరసాపురం జిల్లా ఏర్పాటు కావడం మంచిదేనని అంటున్నా.. జిల్లా కేంద్రంగా మాత్రం నరసాపురం ఉండాలని ఒక నేత, కాదు, భీమవరం ఉండాలని మరోనేత పట్టుబడుతున్నారు. దీంతో ఇది చిలికిచిలికి గాలివానగా మారుతోంది. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు.. తన వాణిని బలంగా వినిపిస్తున్నారు. నరసాపురం జిల్లా కేంద్రంగా ఉంచాలని ఆయన చెబుతున్నారు.దీనికి సంబంధించి ఆయన వాదన ఏంటంటే.. నరసాపురంలో ఇప్పటికే సబ్‌కలెక్టర్ ఆఫీస్‌తోపాటు కొత్తగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు నెలకొల్పడానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉందని చెబుతున్నారట. సముద్రతీర ప్రాంతం కూడా కలిసి వస్తుందని వాదిస్తున్నారట. నరసాపురానికి బ్రిటీష్ వారి పాలన నుంచి ఘనమైన చరిత్ర ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వారధిగా ఉంటుంది. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తే స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులపై ఓ నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఉంచాలని అంటున్న ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన వాదన కూడా బలంగానే వినిపిస్తున్నారు.నరసాపురం బదులుగా అన్ని వనరులకు కేంద్రంగా ఉన్న భీమవరంను జిల్లా కేంద్రం చేయాలని శ్రీనివాస్ కోరుతున్నారు. అంతేకాదు, భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే.. ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారుతుందని, ఇది అన్ని నియోజకవర్గాలకు సమాన దూరంలో ఉంటుందని… మున్ముందు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయన వాదన. అయితే.. ఈ విషయంలో ఈ ఇద్దరి నేతల మధ్య తీవ్ర వివాదం ముదిరిపోతోంది. ఏకంగా ఈ సమస్యను సీఎం జగన్‌కు వివరించేందుకు ఇద్దరూ సమాయత్తమవుతున్నారు. ఇక, వైసీపీలోనే తటస్థ నేతలు మాత్రం వీరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేస్తున్నారు.