YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆ రెండు మండలాల్లో నత్తతో పోటీగా భగీరధ

 ఆ రెండు మండలాల్లో నత్తతో పోటీగా భగీరధ

మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో మిషన్‌ భగీరథ పథకం నత్తనడకన సాగుతోంది. ఈ పథకంలో చేపట్టిన నీటి ట్యాంకులు నిర్మాణం నెలల తరబడి సాగుతోంది. ఇంకొన్ని ట్యాంకుల పనులే ప్రారంభించలేదంటే ఈ పథకం పనితీరు ఇట్టే తెలిసిపోతుంది. పైపులైన్ల నిర్మాణం అస్తవ్యస్తంగా చేస్తున్నారు. ప్రజలు సంచరించే ప్రాంతాలలోనూ గుంతలు తవ్వి వదిలేస్తున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మోత్కూరు మండలంలోని 12 గ్రామ పంచాయతీలు, అడ్డగూడూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలుండగా ఇంకా కొన్ని గ్రామాలకు పైపులైన్ల నిర్మాణం జరగడం లేదు. పైపులైన్లు ఏర్పాటు చేయడం, ట్యాంకులు నిర్మించడం  పూర్తయితేనే గ్రామాల్లో ఇంటింటికీ పైపులైన్లు నిర్మించే అవకాశం ఉందని అధికారులంటున్నారు. వీటన్నింటి నిర్మాణం పూర్తిచేస్తేనే ఇంటింటికీ భగీరథ నల్లానీరు అందించడం సాధ్యమని వారు పేర్కొంటున్నారు. సకాలంలో  నిర్మాణాలు పూర్తి చేయించేందుకు ఉన్నతాధికారులు చొరవచూపాలని స్థానికులు కోరుతున్నారు.గతేడాది జులైలో మోత్కూరు మండలంలో రూ.6.4 కోట్లతో, అడ్డగూడూరు మండలంలో రూ.5.9 కోట్లతో చేపట్టిన ఈ పనులు రానున్న జూన్‌ నెల నాటికి పూర్తి చేయాల్సి ఉంది. మోత్కూరు మండలానికి 22 నీటి ట్యాంకులు మంజూరు కాగా, 18 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. వీటిల్లో ఐదు ట్యాంకులు పూర్తికాగా, ఇంకా నాలుగు ట్యాంకులు నిర్మాణం చేపట్టనే లేదు. అడ్డగూడూరు మండలానికి 19 ట్యాంకులు మంజూరుకాగా, 13 ట్యాంకుల పనులు ప్రారంభించారు. ఇంకా ఆరు ట్యాంకుల పనులు ప్రారంభించనే లేదు. మిగతా ట్యాంకుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ట్యాంకుల నిర్మాణం వేసవిలో చేస్తుండటంతో వాటర్‌ క్యూరింగ్‌ సరిగా చేయడం లేదు. దీంతో అనేక ట్యాంకుల వద్ద పిల్లర్ల నిర్మాణం నాణ్యతగా జరగడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎండల కారణంగా మేస్త్రీలు సరిగా పనులు చేయడం లేదు. గుత్తేదారు పట్టించుకోకపోవడం, కూలీలను ఏర్పాటు చేయకపోవడంతో పనులు సక్రమంగా జరగడం లేదు. 

Related Posts