అనంతపురం
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం లోని భైరవాని తిప్ప ప్రాజెక్ట్ రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం నియోజకవర్గాలలో ఆయకట్టుకింద సాగు చేసే రైతులకు ఒక జీవనది లాంటిది . ఇప్పుడు బిటిపి ప్రాజెక్టుకు 1652 అడుగులకు మేర వరద నీరు చేరుకుంది. పది రోజులుగా ఎగువనున్న కర్ణాటక ప్రాంతం నుంచి వేదవతి, హగరి నది ద్వారా ప్రాజెక్టుకు వరద నీరు చేరుతుండడంతో నీటి మట్టం సామర్థ్యం పెరిగింది.1655 అడుగుల నీటి సామర్థ్యం తో ఉన్న ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి మట్టం చేరేందుకు మరో మూడు అడుగులు మాత్రమే ఉంది. వచ్చే రెండు రోజుల్లో కురిసే వర్షాలకు వరద నీటి ఇన్ఫ్లో పెరిగితే ఏక్షణంలోనైనా గేట్లు ఎత్తే ఆస్కారం ఉందని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో వేదవతి, హగరి నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పెరగడంతో ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో అధికారులు సౌకర్యాలపై దృష్టి పెట్టారు. కుడి ఎడమ కాలువ పరిధిలో సాగునీరు అందించేందుకు ముందస్తుగానే కాలువలు మరమ్మతులు చేసుకోవాలని ఆయా గ్రామాల్లో రైతులను అప్రమత్తం చేస్తున్నారు. వర్షానికి ప్రాజెక్ట్ రివిట్మెంట్ కుంగడంతో అధికారులు అప్రమత్తమై మరమ్మతు పనులు చేపట్టారు. ఎడమ పక్క కాలు కింద 8,400 ఎకరాలు, కుడి పక్క కాలువ కింద 4000 ఎకరాలలో రైతులు సాగు చేస్తూ జీవనం సాగించేవారు. అధికారులు ఈ ప్రాజెక్టు 1951లో ప్రారంభించి 1961లో ప్రాజెక్టు పూర్తి చేశారు. అప్పట్లో కర్ణాటక రాష్ట్రంలో చెక్ డ్యాములు లేనిపక్షంలో ప్రతి సంవత్సరం డ్యామ్ నిండడం వల్ల ఆయకట్టు కింద ఉన్న రైతులు సాగు చేసేవారు.ఇప్పుడు పరిస్థితి చూస్తే కర్ణాటక రాష్ట్రంలో చెక్ డ్యాంలు నిర్మించడంతో బీటీ ప్రాజెక్టుకు ఐదు సంవత్సరాలకు ఒకసారి కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు బాగా కురిస్తే అక్కడ చెక్ డ్యామ్ నుండి వచ్చే నీరు బీటీ ప్రాజెక్టు కు చేరుకుంటుంది. ప్రాజెక్టు ఆయకట్టు కింద 12400 ఎకరాల్లో రైతులు సాగు చేసేవారు. ఆయకట్టు కింద ఆధారపడి సాగు చేసుకునే రైతులు నేడు పనులు లేక బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ,ముంబై మహానగరాలకు వలసగా వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీటీ ప్రాజెక్టుకు కృష్ణాజలలు తీసుకు వస్తేనే శాశ్వత పరిష్కారం అంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గెలిచిన మూడు నెలల్లోనే కృష్ణా జలాలు తేప్పిస్తానని హామీ ఇచ్చి నేటికీ రెండున్నర సంవత్సరాలు అవుతున్న బీటీ ప్రాజెక్టుకు నీరు తెప్పించడంలో విఫలమయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి బీటీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తెప్పించి ఆయకట్టు కింద పంట సాగు చేస్తున్న రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందంటున్నారు. లేనిపక్షంలో గ్రామాలు వదిలి వలసలకు వెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.