కర్నూలు జిల్లాలో నెలకొల్పుతున్న కొత్త పరిశ్రమల వల్ల 80 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 88 వేల కోట్ల రూపాయిల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించనున్నారని ఆయన అన్నారు. కర్నూలు జిల్లాలో మరిన్ని కొత్త సంస్థలు రాబోతున్నాయని ఆయన అన్నారు. గురువారం అయన కర్నూలు జిల్లా ఓర్వకల్లు గుట్టపాడు సమీపంలో జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రూ.3 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకానుందని, తద్వారా 5 వేల మంది యువతకు ఉపాధి లభించనుందని సీఎం చెప్పారు. పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని ఆయన అన్నారు. ఓర్వకల్లులో అత్యద్భుతమైన టౌన్షిప్ను నిర్మించనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నిన్నటి వరకూ ఈ ప్రాంతమంతా రాళ్లూ రప్పలతో నిండి ఉండేదని ఆయన చెప్పారు. వ్యవసాయానికి అనుకూలం కాకపోవడంతో ఎవరూ ఇక్కడ వ్యవసాయం చేయడానికి సాహసించలేదని ఆయన అన్నారు. శ్రీసిటీతో సమానంగా అద్భుతమైన ఇండస్ట్రియల్ టౌన్షిప్గా ఓర్వకల్లును అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలు జిల్లాలో మెగా సీడ్స్ ప్రాజెక్టు వస్తోందని, దీని వల్ల రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కర్నూలులో విత్తనాభివృద్ధికి అనుకూల వాతావరణం ఉందని ఆయన అన్నారు. 650 ఎకరాల్లో మెగా సీడ్స్ ప్రాజెక్టు వస్తుందన్నారు. ఇక్కడి విత్తనాలను ప్రపంచవ్యాప్తంగా విక్రయించే స్థాయికి చేరుతామన్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.