రాజమండ్రి డిసెంబర్ 7
రాజమహేంద్రవరం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) టర్మినల్ పరిధిలో ఏపీ పెట్రోల్ ట్యాంక్స్ అండ్ ట్రక్స్ ఆపరేటర్ల సంఘం సమ్మెకు దిగనున్నది. ఫలితంగా ఈ నెల 18 నుంచి పెట్రోల్, డీజిల్ రవాణా నిరవధికంగా నిలిచిపోనున్నది. ఈ విషయాన్ని ఏపీ పెట్రోల్ ట్యాంక్స్ అండ్ ట్రక్స్ ఆపరేటర్ల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఐవోసీ కంపెనీకి సమ్మె నోటీసు ఇచ్చినట్లు సంఘం పేర్కొన్నది. కాగా, ఏపీ పెట్రోల్ ట్యాంక్స్ అండ్ ట్రక్స్ ఆపరేటర్ల ఆందోళనకు పెట్రోలియం డీలర్ల సమాఖ్య మద్దతు ప్రకటించింది.ఉభయ గోదావరి జిల్లాల్లో 125 ట్రక్కుల ద్వారా 160 ఐవోసీ బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతున్నది. కాగా, ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవాలని ట్యాంక్స్ అండ్ ట్రక్స్ ఆపరేటర్ల సంఘం డిమాండ్ చేసింది. 15 ఏండ్ల పైబడిన ట్యాంకర్లను ఇతర ప్రాంతాల్లో మాదిరిగా అనుమతించాలని డిమాండ్చేసింది. ఈ నెల 17 లోగా డిమాండ్లు పరిష్కరించనిపక్షంలో.. 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు వెల్లడించింది.