- పిండాన్ని బయటికి తీసి ఆపరేషన్
- వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయం
గర్భస్థ పిండానికి శస్త్రచికిత్స చేయడం సాధారణమే.. కానీ, పిండాన్ని బయటికి తీసి శస్త్రచికిత్స చేసి మళ్లీ తల్లి గర్భంలో అమర్చడం సాధ్యమేనా? ఏ చిన్న తప్పు జరిగినా పిండానికి, గర్భిణికి ప్రాణాపాయమే. కానీ, ఓ వైద్యుడు దాన్ని సుసాధ్యం చేసి వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. నైజీరియా సంతతి వైద్యుడు డాక్టర్ ఒలుయింకా ఒలుటోయే టెక్స్‌సలోని ఓ చిన్న పిల్లల ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఒక రోజు ఓ గర్భిణి సమస్య ఉందంటూ ఆస్పత్రికి వచ్చింది. ఏం జరిగిందో చూద్దామని వైద్యులు స్కానింగ్ తీశారు. ఆ స్కానింగ్‌లో పిండానికి హానికారక కణితి ఉందని గుర్తించారు. ఆ కణితిని తొలగిస్తేనే తల్లికి, బిడ్డకు ప్రమాదం తప్పుతుంది. కడుపులో ఉండగానే కణితిని తొలగించడం సాధ్యం కాదు. ఏం చేయాలి.. పిండాన్ని బయటికి తీసి కణితిని తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఒలుయింకా నేతృత్వంలోని వైద్య బృందం ఆ పిండాన్ని బయటికి తీసి కణితిని తొలగించి యథావిధిగా తల్లి గర్భంలో అమర్చి కుట్లేశారు. ఇంకేముంది.. 36 వారాలకు సంపూర్ణ ఆరోగ్యంతో పండంటి బిడ్డ పుట్టింది. గత ఏడాది జరిగిన ఈ అద్భుత కార్యాన్ని ఓ ట్విటర్ యూజర్ షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఆ వైద్యుడికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 90వేల రీట్వీట్లు వచ్చాయి.