ప్ర: మయసభలో ఒకదానికొకటిగా భ్రమపడ్డ దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్వడం తప్పు కాదా! ఆ పరిహాసానికి ప్రతీకారం తీర్చుకున్నాడు దుర్యోధనుడు. అంతే కదా!
జ: దురదృష్టవశాత్తు రావణ, దుర్యోధనాది రాక్షస ప్రవృత్తుల అభిమానులు మనలో ఎక్కువై, వారిని కథానాయకులుగా మలచేందుకు ఎన్నో అకృత్యాలు చేశారు. అలాంటివే - దుర్యోధనుని భంగపాటు చూసి ద్రౌపది నవ్వడంలాంటి కల్పనలు చేయడం.
'మయసభ'లో దుర్యోధనుడు స్థలాన్ని జలంగా, జలాన్ని స్థలంగా భ్రమపడి భంగపడ్డాడు. అది చూస్తే నవ్వురావడం సహజం. అన్నదమ్ములే అయిన భీమార్జున నకుల సహదేవులు అది చూసి నవ్వారు. అంతే. అక్కడ ద్రౌపది లేనే లేదు. రాజ మర్యాదలు కూడా మనకు తెలియాలి. ఒక రాజపత్ని ఆ విధంగా పరుల మందిరాల్లోకి రాదు కూడా. దుర్యోధనుడు ప్రతీకార దృష్టితో అకృత్యాలు చేయలేదు. అతడు ధర్మరాజాదుల పరాక్రమ, వైభవాలను రాజసూయ యాగంలో చూశాక తీవ్రంగా అసూయాగ్రస్తుడయ్యాడు. పరాక్రమంతో, యజ్ఞ నిర్వహణతో సుస్థిర సామ్రాజ్యాన్ని సాధించిన యుధిష్ఠిరుని పట్ల ఈర్ష్య చెందాడు. ఆ కారణంగా, అతడు మాయాద్యూతాదులు కల్పించి, పాండవుల సంపదలను రాబట్టుకొని ఇక్కట్ల పాలుచేశాడు.