విజయవాడ, డిసెంబర్ 8,
తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం జగన్మోహన్‌రెడ్డి సేద తీరుతుంటారు. కృష్ణా నది పక్కనుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యమంత్రి హడావుడి ఉండే ఏరియా అంటే భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉండాలి? సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉండాలి? అనుమానాస్పద కదలికలపై ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉండాలి? చీమ చిటుక్కుమన్నా.. సెక్యూరిటీ వింగ్‌కు తెలిసేలా నెట్‌వర్క్ ఉండాలి. కానీ, తాడేపల్లిలో ఏం జరుగుతోంది? క్రైం కేపిటల్‌గా ఎందుకు మారుతోంది? అనే చర్చ కొనసాగుతోంది. గతంలో కృష్ణానది తీరంలో ఓ యువతిపై అత్యా-చారం జరగడం సంచలనంగా మారింది. ఇప్పటికీ ఆ కేసులో నిందితుడిని పట్టుకోకపోవడం ఎంతటి వైఫల్యం? ఇది చాలదన్నట్టు.. లేటెస్ట్‌గా సీఎం జగన్‌రెడ్డి ప్యాలెస్‌కు కిలోమీటర్ దూరంలోని రెయిన్ బో విల్లాస్‌లో చెడ్డీ గ్యాంగ్ దోపీడీకి ప్రయత్నించడం మరింత షాకింగ్ పరిణామం అంటున్నారు. వరుస ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని.. పోలీసుల చేతగాని తనానికి సవాల్‌గా నిలుస్తున్నాయని చెబుతున్నారు. వీవీఐపీ జోన్ అంటేనే ఫుల్ సెక్యూరిటీ. అందులోనూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి సమీప ప్రాంతమంటే ఎవరిలోనైనా కాస్తంత అదురు..బెదురు ఉంటుంది. అలాంటిది.. కరుడుగట్టిన చెడ్డీ గ్యాంగ్ మాత్రం ఎలాంటి భయం లేకుండా.. జగన్ ప్యాలెస్‌కు జస్ట్ కిలోమీటర్ దూరంలోని రెయిన్ బో విల్లాల్లో దోపిడీకి తెగించారంటే మామూలు విషయమా? దొంగలకు ఇంతటి బరితెగింపు ఎలా వచ్చిందనేకంటే.. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఖాకీలను దోషులుగా చూస్తున్నారు. ఇక, చెడ్డీ గ్యాంగ్ చోరీకి ప్రయత్నించింది మామూలు ఇళ్లల్లో కాదు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.. చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ తో పాటు.. ఓ వ్యాపారికి చెందిన విల్లాల తలుపులు పగలగొట్టి లోపలకు చొరబడటం సంచలనంగా మారింది. విల్లాల్లో విలువైన వస్తువులు ఏవీ పోకున్నా.. దొంగలు విరుచుకుపడిన ప్రాంతం హై సెక్యూరిటీ జోన్‌లో ఉండటమే కలకలం రేపుతోంది. సీఎం జగన్ ప్యాలెస్ సమీప ప్రాంతాల్లో నిఘా, భద్రత లోపాలను చెడ్డీ గ్యాంగ్ ఘటనతో మరోసారి బయటపడింది. గతంలో కృష్ణా నది తీరంలో రే-ప్ ఘటన జరిగినప్పుడే ఈ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేసుంటే.. ఇప్పుడిలా దొంగల ముఠా బరితెగించి ఉండకపోయేదని అంటున్నారు. ప్రభుత్వ, పోలీసుల అసమర్థతతోనే ఇలా జరుగుతోందని.. తాడేపల్లి క్రైం కేపిటల్‌గా మారిపోతోందా అనే అనుమానం కలుగుతోందని స్థానికులు మండిపడుతున్నారు.