YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోస్తా వర్సెస్ రాయలసీమ

కోస్తా వర్సెస్  రాయలసీమ

తిరుపతి, డిసెంబర్ 8,
అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఇవాళ రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశించింది. ఇప్పటివరకూ కోస్తా జిల్లాల్లో సాగిన ఈ యాత్రకు టీడీపీ, బీజేపీ మద్దతివ్వడంతో ఎలాంటి చిక్కుల్లేకుండా సాగిపోయింది. కానీ ఇప్పుడు హైకోర్టు ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పాదయాత్రకు సీమ జిల్లాల్లో మాత్రం వ్యతిరేకత తప్పేలా లేదు. ముఖ్యంగా తిరుపతిలో నిర్వహించే బహిరంగసభకు వ్యతిరేకంగా సీమ నేతలు గొంతెత్తున్నారు. దీంతో ఇది కోస్తా వర్సెస్ సీమ వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఇవాళ నెల్లూరు జిల్లాను దాటి చిత్తూరులోకి ప్రవేశించింది. ఈ నెల 19 వరకూ సాగే ఈ యాత్ర రాయలసీమ జిల్లాల మీదుగా సాగబోతోంది. దీంతో ఇప్పుడు మూడు రాజధానుల్లో భాగంగా హైకోర్టును సాధించుకున్న సీమ జిల్లాల వాసులకు ఈ యాత్ర కంటగింపుగా మారుతోంది. ముఖ్యంగా అక్కడి రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు, పోరాట సమితులు, మేథావులు ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. రాయలసీమలో హైకోర్టును వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు తమ ప్రాంతంలో పాదయాత్ర, బహిరంగసభలు ఎలా చేపడతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.రాయలసీమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమరావతిలోనే పూర్తి రాజధాని కోరుతున్న రైతులు తమ ప్రాంతంలో చేసే పాదయాత్రను అడ్డుకోవాలనే డిమాండ్లు అక్కడ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతిలో రైతులు పెట్టే బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదనే డిమాండ్లు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అమరావతి రైతుల బహిరంగసభకు అనుమతి నిరాకరించింది. దీంతో హైకోర్టుకు వెళ్లి మరీ తమ బహిరంగసభకు అనుమతి తెచ్చుకుంటామని అమరావతి జేఏసీ చెబుతోంది. దీంతో హైకోర్టు ఈ బహిరంగసభకు అనుమతి ఇస్తే తలెత్తే పరిస్ధితులపై ఆందోళన నెలకొంటోంది.ఇప్పటివరకూ కోస్తా జిల్లాల్లో సాగిన యాత్రకు స్దానికంగా కొందరు కాకపోతే మరికొందరు అన్న తరహాలో మద్దతు లభించింది. ముఖ్యంగా అమరావతి పాదయాత్రకు ముందునుంచీ మద్దతిస్తున్న టీడీపీతో పాటు మధ్యలో జతకలిసిన బీజేపీ, సీపీఐ వంటి పార్టీలు అండగా నిలిచాయి. ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశించిన యాత్రకు వీరంతా ఎంత మేరకు అండగా ఉంటారన్న దానిపై రైతుల పాదయాత్ర సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తిరుపతిలో బహిరంగసభకు టీడీపీ, బీజేపీ సహా విపక్షాలన్నీ మద్దతిస్తే తలెత్తే పరిస్దితులపైనా ఉత్కంఠ నెలకొంటోంది.అమరావతి రాజధానికి రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు మద్దతిస్తున్నాయన్నది ఇప్పటివరకూ స్పష్టత లేదు. కానీ కోస్తా జిల్లాల్లో మాత్రం అమరావతి రైతుల పాదయాత్రకు మంచి స్పందనే లభించింది. కానీ రాయలసీమ జిల్లాల్లో మాత్రం అలాంటి పరిస్దితి కనిపించడం లేదు. అంతటితో ఆగితే సరిపోతుంది. కానీ రేపు అమరావతి రైతుల్ని అడ్డుకునేందుకు రాయలసీమలో వైసీపీ కానీ స్ధానికంగా ఉండే సంఘాలు, నేతలు కానీ ప్రయత్నిస్తే మాత్రం ఈ వివాదం కాస్తా కోస్తా వర్సెస్ రాయలసీమగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో వైసీపీ ఎలాంటి వైఖరి తీసుకోబోతోందన్నది కీలకంగా మారింది.అమరావతి రైతులు రాయలసీమలో సాగిస్తున్న పాదయాత్రకు మద్దతివ్వడం లేదా వ్యతిరేకించే విషయంలో ప్రస్తుతానికి అయితే రాజకీయ పార్టీల స్టాండ్ స్పష్టంగానే ఉంది. వైసీపీ ఈ యాత్రను వ్యతిరేకిస్తుంటే మిగతా విపక్ష పార్టీలన్నీ ఈ యాత్రకు అండగా నిలుస్తున్నాయి. రేపు కోస్తా వర్సెస్ రాయలసీమ వివాదానికి ఈ యాత్ర ఆజ్యం పోస్తే అప్పుడు వైసీపీ ఎలాంటి వైఖరి తీసుకోబోతోందన్నది ఇంకా తేలలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తమకు సమానమే అంటున్న పార్టీలు రాయలసీమలో అమరావతి రైతుల యాత్రను సమర్దించడం లేదా వ్యతిరేకించడంపైనే రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉండబోతోంది.

Related Posts