YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టార్గెట్ బీజేపీ.... వ్యూహాలు సిద్ధం చేస్తున్న కేసీఆర్

టార్గెట్ బీజేపీ.... వ్యూహాలు సిద్ధం చేస్తున్న కేసీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 8,
భారతీయ జనతా పార్టీ వర్గాలలో ఫ్రెండ్లీ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర సమితి చివరకు ప్రతిపక్షాల గూటికి చేరింది. తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ బలానికి నిదర్శనంగా విశ్లేషకులు ఈ పరిణామాలను చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు తటస్థ వైఖరిని అనుసరించింది. చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్ధించింది. బిల్లలుకు మద్దతిచ్చింది. లేదంటే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించిందే తప్ప ఏనాడూ వ్యతిరేకత ప్రదర్శించలేదు. మోడీ సర్కార్‌ని విమర్శించటం చాలా అరుదు. ఎన్నికల వేళ మాత్రమే అవి ప్రత్యర్థులను తలపిస్తాయి. మధ్య మాటల తూటాలు పేలతాయి. ఎన్నికల తరువాత మళ్లీ మామూలే.మోడీ ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలపై కూడా టీఆర్‌ఎస్‌ మొదట తటస్థ వైఖరిని అనుసరించింది. రైతు ఆందోళనలకు మద్దతు ఇవ్వలేదు. చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయలేదు. కాబట్టి కేంద్రంతో టీఆర్‌ఎస్‌ విధానం మోడీ కనుసన్నల్లో కేసీఆర్ నడుస్తున్నారనే భావన కలిగించింది. ఈ ఏడేళ్లలో ఈ భావన బలపడింది. ఐతే, హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఓటమి తరువాత బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ తప్పనిసరి పరిస్థితిలో తన విధానం మార్చుకోవాల్సి వచ్చింది. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు దానిని సూచిస్తున్నాయి.వివాదాస్పద సాగు చట్టాలు, లఖింపూర్ ఖేరీ దుర్ఘటన, విద్యుత్ సంస్కరణలు, పెరుగుతున్న ఇంధన ధరలు, చైనా దురాక్రమణతో పాటు ఇంకా అనేక అంశాలలో మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. పార్టీ ఇప్పటి వరకు అనుసరిస్తున్న తటస్థ వైఖరిని వదిలిపెట్టాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చెప్పారు. ఎంపీలకు దీనిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో తొమ్మిది మంది, రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరు ఇతర ప్రతిపక్ష పార్టీల సమన్వయంతో కేంద్రానికి వ్యతిరేకంగా తమ దాడిని తీవ్రం చేస్తున్నారు.నిజానికి, బీజేపీని టార్గెట్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వరి కొనుగోలు అంశాన్ని తెరమీదకు తెచ్చింది. కాబట్టి దీనిని కేంద్రం వర్సెస్‌ టీఆర్‌ఎస్‌లా కాకుండా బీజేపీ మీద టీఆర్‌ఎస్ యుద్ధంగా చూస్తే బాగుంటుంది. ధాన్యం కొనుగోలు అంశంపై కొద్ది రోజులుగా రాష్ట్ర బీజేపీ నేతలను కేసీఆర్‌ ఇరుకున పెడుతున్నారు. రైతుల ధర్నాలు.. నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ పార్టీ ఎంపీలు దీనిని పతాక శీర్షికలకు ఎక్కించారు. అంతే కాదు, వరి కొనుగోళ్ల అంశంపై మరింత తీవ్రంగా పోరాడాలని కేసీఆర్‌ తాజాగా మరోమారు ఎంపీలకు సూచించారు. అవసరమైతే ఢిల్లీకి వెళతానని కేసీఆర్‌ చెప్పటం రాబోవు రోజుల్లో కేంద్రంతో టీఆర్‌ఎస్‌ పోరు మరింత తీవ్రమవుతుందనటానికి సంకేతం.2018 అసెంబ్లీ ఎన్నికలలో 119 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది. 106 నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. ఐతే, 2019 సార్వత్రిక ఎన్నికలలో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా పార్టీ పుంజుకుంది. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి చేతిలో కేసీఆర్‌ కూతురు కవిత ఓటమి పాలైంది. దాంతో టీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన టీఆర్‌ఎస్‌లో గుబులు రేపింది. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓటమి కేసీఆర్ కు పెద్ద షాక్.తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కేసీఆర్‌ ఆందోళనకు కారణం కావచ్చు. బహుశా ఆందుకే ఆయన తాత్కాలికంగా అయినా కాంగ్రెస్‌తో కలిసి నడవాలనే నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంశాల ప్రాతిపదికన పోరాడేందుకు టీఆర్ఎస్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపింది. వివాదాస్పద వరి సేకరణ సమస్యపై ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతును టీఆర్‌ఎస్‌ ఆశిస్తోంది.మరోవైపు, ఈ పరిణామాలను బీజేపీ మరోలా తీసుకుంటోంది. 2023 ఎన్నికల్లో బీజేపీయే తన ప్రత్యర్థిగా కేసీఆర్‌ డిసైడ్‌ అయ్యారని ప్రచారం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదని కమలం పార్టీ నాయకులు అంటున్నారు. ఐతే, బీజేపీకి ధీటుగా టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార నినాదాన్ని సృష్టించే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది.మరోవైపు, టీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ-కాంగ్రెస్‌ కలలో కూడా కలవవు. అదే కేసీఆర్‌కు అతి పెద్ద బలం.

Related Posts