హైదరాబాద్, డిసంబర్ 8,
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ దూకుడు కొనసాగుతోంది. ఈ ఏడాది 11 నెలల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 21,988 ఇళ్ల విక్రయాలు జరగ్గా... రూ.11,164 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం నివేదిక వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇళ్ల ధరలు సగటున 6శాతం పెరిగాయని, వార్షిక వృద్ధి 16శాతంగా నమోదైందని పేర్కొంది.కరోనా ప్రభావంతో గతేడాది ఆరంభంలో ఇళ్ల విక్రయాలు మందగించినా.. చివరిలో బాగా పుంజుకున్నాయి. 2020 జనవరి నుంచి నవంబరు వరకు 18,888 ఇళ్లు విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది 16 శాతం వృద్ధితో 21,988 ఇళ్ల విక్రయాలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక పేర్కొంది. విక్రయించిన ఇళ్లల్లో రూ.50 లక్షల లోపున్న ఇళ్ల వాటా 66 శాతంగా ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది. రూ.25లక్షల- రూ.50 లక్షల మధ్య విక్రయాలు 34 శాతం నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 3శాతం పెరిగింది. మరోవైపు రూ.25 లక్షల లోపు ఇళ్ల వాటా 35 నుంచి 32 శాతానికి పడిపోవడం గమనార్హం. రూ.75 లక్షల నుంచి రూ.2 కోట్లపైన విలువ ఉన్న ఇళ్ల విక్రయాల వాటా స్థిరంగా ఉంది. కొవిడ్ కారణంగా గతేడాది ఇళ్ల ధరలు స్థిరంగా ఉండగా, ఈ ఏడాది మార్కెట్ కాస్త పుంజుకోవడంతో ధరలు పెరిగాయి.