YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోపభూయిష్టంగా వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లు

లోపభూయిష్టంగా వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లు

నగరంలో వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. నగరం మొత్తంగా చిన్నాచితకా హాస్టళ్లు వందకుపైగా ఉంటాయి. అయితే ఈ హాస్టళ్లలో ఉండే మహిళలు, విద్యార్థినుల రక్షణ ప్రశ్నార్ధకంగా మారింది. భద్రతా నిబంధనలకు గాలికొదిలేసినట్లు గత నెలలో తనిఖీలు నిర్వహించిన మహిళా కో ఆర్డినేటర్ల బృందాలు వెల్లడించాయి. లోపభూయిష్టంగా నడుస్తున్న వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లలో ఏ మేరకు భద్రత ఉందనే ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. గతంలో ఇబ్రహీంపట్నం వద్ద ఇటువంటి లోపభూయిష్టంగా నిర్వహించిన హాస్టల్‌లో ఆయేషామీరా అనే విద్యార్ధిని ఎలా హత్యకు గురైందో విజయవాడ నగర ప్రజలు నేటికీ మరచిపోలేదు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మహిళా హాస్టళ్ల వద్ద రక్షణ పరమైన చర్యలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంది. పోలీసులు లబ్బీపేట, సూర్యారావుపేట తదితర ప్రాంతాల్లోని 38 వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు. ఆయా హాస్టళ్లలో అత్యధిక భాగం ప్రభుత్వ అనుమతులు లేనివి ఉన్నట్లు గుర్తించారు. కొన్నింటిలో సిసి కెమెరాలు కూడా లేవని స్పష్టం చేశారు. మరి కొన్ని హాస్టళ్లలో వాచ్‌మెన్లను కూడా ఆయా యాజమాన్యాలు ఏర్పాటు చేయని విషయాన్ని గుర్తించారు. వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల వారు కూడా ఉంటున్నారు. విద్యాభ్యాసం కోసం విజయవాడ వచ్చే విద్యార్థినుల సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. నూతన రాజధాని ప్రాంతం కావడంతో ఉద్యోగావకాశాల కోసం సూదూరప్రాంతాల నుండి కూడా నగరానికి వచ్చే మహిళలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఉద్యోగాన్వేషనలో ఉన్న వారు, చాలీచాలనీ జీతాలతో ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువగా వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే నగరంలో అపరిచిత వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈనేపథ్యంలో మహిళలకు రక్షణ కల్పించడం పోలీసులకు కత్తిమీద సాములా మారిందనడంలో సందేహంలేదు. ఇదిలా ఉంటే మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లకు అనుమతులులేని వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరుతుండగా, పోలీసులు మాత్రం తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.

Related Posts