వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికలకు ముందస్తు కసరత్తు మొదలుపెట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ సారి తప్పొప్పులు సరిదిద్దుకుని ముందుకు సాగేందుకు వీలుగా పకడ్బందీగా వ్యవహరించాలనే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీనికి బెజవాడను వేదికగా చేయటం వెనుక.. టీడీపీకు ధీటుగా తమ బలం చాటడమే ప్రధాన ఉద్దేశమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ మూడంచెల విధానంలో తొలిసారి ప్లీనరీ సమావేశాలకు రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా మే, జూన్, జులై నెలల్లో మూడంచెలుగా సమావేశాలు నిర్వహిస్తారు.. జులై 8వ తేదీ ముగింపు సమావేశం విజయవాడలో సుమారు 13 వేలమంది కీలకమైన పార్టీ ప్రతినిధులతో జరిపేందుకు వేదికను రెడీ చేస్తున్నారు. 2014లో చేదు అనుభవాలు ఎదురైన.. ఓటింగ్ శాతం తక్కువగా పోలైన నియోజకవర్గాలు.. జిల్లాలపై ఇప్పటి నుంచే చేయాల్సిన పనులు.. ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసేలా.. ఇక్కడ కొంతమేర నివేదికలు తయారు చేసే వీలుంది. ప్రస్తుతం ఏపీలోని 13 జిల్లాల్లో గ్రామ, మండల స్థాయిలో వైసీపీ బలాలు, బలహీనతలు.. ప్రజల అంతరంగం తదితర అంశాలను కొంతమేర తెప్పించారు. బలహీనంగా ఉన్న గ్రామాల్లో.. పార్టీను బలంగా మార్చేందుకు అక్కడున్న పరిస్థితులు.. అనువైన వ్యక్తులు.. నాయకుల వేట కూడా సాగుతుందట. అవినీతి అనేది.. వచ్చే ఎన్నికల్లో వైసీపీపై పెద్దగా ప్రభావం చూపదనే అభిప్రాయానికి వైసీపీ నేతలు వచ్చినట్లు సమాచారం. కాబట్టి.. టీడీపీ పాలనలో నేతలు తప్పిదాలు.. పాల్పడిన అవినీతిని బయటకు తీసుకురావటం ద్వారా.. 2014లో టీడీపీ ప్రచారాస్త్రంగా ఉపయోగించిన.. అవినీతినే.. ఈ సారి.. వైసీపీ ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. దీనిపై టీడీపీ ఎంత ధీటుగా.. సమాధానం ఇస్తుందనేది చూడాలి.ఏపీలో బలమైన సామాజికవర్గంగా ముద్రపడిన కాపులను తనవైపునకు తిప్పుకునేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు తరహాలో మంత్రాంగం నడపాలని ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలతో మంతనాలుకూడా సాగిస్తున్నట్లు సమాచారం. అంబటి రాంబాబుకు బాధ్యతలు అప్పగించి..కాపుల ఓట్ల లెక్కలు ఆరాతీయమని పురమాయించాడట. ఇప్పుడే ఎందుకీ తతంగం అనే అనుమానం వెనుక భవిష్యత్ వ్యూహం దాగున్నట్లు సమాచారం. జనసేన నేత పవన్‌కళ్యాణ్.. చంద్రబాబుకు మద్దతు ప్రకటించి 2014 ఎన్నికల్లో అండగా ఉంది. 2019లో కూడా ఇదే పునరావృతమైతే.. జగన్ ఆశలు అడియాశలైనట్లే. అందుకే.. పవన్‌కు ఓటుబలం ఉన్న చోట ఓట్లను చీల్చటమో.. పూర్తిగా రాబట్టడమో చేయటం ద్వారా పవన్-చంద్రబాబు మైత్రిని దెబ్బతీయాలనే వ్యూహంతో వైసీపీ అధినేత పావులు కదుపుతున్నట్లు సమాచారం.