ఒకనాడు గురువుగారు శిష్యులకు పాఠాలు బోధిస్తూ వున్నారు. ఆ సమయంలో ఒక శిష్యుడు " ఆచార్యా..
మీరు శిష్యులందరికి సమంగానే పాఠాలు బోధిస్తున్నారు.కాని శిష్యులందరూ ఒకేలాగ తెలివి తేటలనో, గ్రహింపు శక్తి ని గాని పేరు గాని పొందడం లేదు ఎందు వలన ?" అని అడిగాడు. దానికి బదులు ఏమీ చెప్పలేదు గురువుగారు. శిష్యులందరికి చిన్న చెక్క ముక్కని యిచ్చి, దీనిని మీకు యిష్టమైన వస్తువుగా తయారు చేసి రేపు తీసుకు రండి."అన్నారు. మరునాడు శిష్యులు తాము తయారు చేసిన వస్తువులు తీసుకుని వచ్చారు. అవి అన్నీ చూసిన గురువు ముందు రోజు ప్రశ్నించిన శిష్యుని పిలిచారు. " అందరికీ ఒకే విధమైన కొయ్య చెక్కని యిచ్చాను. అలాగే సమయం అందరికి ఒక్క లాగే..యిచ్చాను. చూడు వాటిలో ఎంత మంది ఒకే రకంగా తయారు చేశారా అన్నది గమనించు. కొంత మంది చిత్రాలు వేసే తూలిక, మరికొందరు వ్రాసే కలంగా వారి కల్పనా శక్తికి తగినట్లు తయారు చేసి తీసుకుని వచ్చారు. మరి కొంత మంది బాణం, ఈటె వంటి ఆయుధాలుగా చేశారు. సందర్భం, సమయం, నే యిచ్చిన వస్తువు అందరికీ సమానంగానే వున్నవి. కాని వారి వారి కల్పనాశక్తిని బట్టి ఉపయోగించుకోవడం జరిగింది. విద్యాబోధన కూడా అటువంటిదే అందరికీ సమానంగా బోధించడం జరుగుతుంది. కాని నేర్చుకున్నవారు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ,అన్నదానిలోనే మార్పులు. అర్ధమైనదా? అని ప్రశాంతంగా చెప్పారు గురువుగారు. గరువుగారి ఔన్నత్యాన్ని గ్రహించుకున్నాడు శిష్యుడు.