గుంటూరు, డిసెంబర్ 9,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మరో మారు దిగి వచ్చారు. ప్రజాగ్రహానికి తల వంచారు.ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, వెల్లువెత్తిన నిరసనలు, జనాగ్రహానికి ‘జగనన్న’ దిగి వచ్చారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకమని ఓ ముద్దు పేరు తగిలించి, ఎప్పుడో ఏనాడో ఆ నాటి ప్రభుత్వాలు పేద ప్రజలకు వివిధ పథకాల ద్వారా ఇచ్చిన ఇళ్ళకు, ఇప్పుడు రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీపీ) చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోమని, లేదంటి రేషన్ సహా సంక్షేమ ఫలాలు అందవని మెడ మీద కత్తి పెట్టి, దుర్మార్గపు వసూళ్ళకు దిగిన జగన్ ప్రభుత్వం, చివరకు దిగి వచ్చింది. ఇంతవరకు గ్రామ వాలంటీర్ల గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులకు టార్గెట్లు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మెట్టు దిగింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,స్వరం మార్చి, ‘”అబ్బే బలవంతం ఏమీలేదు, ఓటీఎస్ వినియోగించుకోవాలా? వద్దా? అనేది ప్రజల ఇష్టమే” అని చెప్పు కొచ్చారు. ముఖ్యమంత్రి ఈరోజు ఓటీఎస్ పథకం, గృహనిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ పథకం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించి, అర్థం చేయించాలన్న ముఖ్యమంత్రి.. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు. ప్రజలు ఈ పథకాన్ని వద్దనుకుంటే అవసరం లేదని చెప్పారు. మూడు రాజధానుల విషయంలో ఎలాగైతే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా వ్యవహరించారో అదే విధంగా ఓటీపీ విషయంలోనూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ పథకం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. ఓటీఎస్ ద్వారా పట్టా పొందితే.. ఆ ఇంటిని అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చని, కావాలంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతుందని వెల్లడించారు. ఓటీఎస్ పథకం ద్వారా అన్నిరకాల సంపూర్ణహక్కులూ ఇంటి యజమానులకు లభిస్తాయని తెలిపారు. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామన్న జగన్.. ఆ అవకాశాలను వాడుకోవాలా? లేదా? అన్నది ప్రజల ఇష్టమేనని చెప్పారు. ఈ పథకం ద్వారా.. రూ.10 వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని చెప్పారు.రూ.10 వేల కోట్ల భారాన్ని తగ్గించి ఓటీపీ పేరున ఏకంగా రూ.60 వేల కోట్ల భారం మోతుతున్న విషయాన్ని మాత్రం చెప్పలేదు సీఎం జగన్ రెడ్డి. ఏది ఏమైనా జనాగ్రహానికి తలొగ్గి ముఖ్యమంత్రి మరోమారు మడమ తిప్పారు. అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ట్రాక్ రికార్డును గమనిస్తే, ఇది వ్యూహాత్మకంగా వేసిన వెనకడుగే తప్ప, మనసు మారి తీసుకున్న మంచి నిర్ణయం కాదని పరిశీలకులు అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లే తగ్గి, మరో దొంగ దెబ్బ తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని కూడా అంటున్నారు.