చిత్తూరు అమరావతి డిసెంబర్ 9
అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్‌తో రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఇవాల 39 వ రోజుకు చేరింది. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట రైతులు యాత్రి చేపడుతున్నారు. పోలీసు ఆంక్షల మధ్య రైతుల యాత్ర ఇవాళ శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపటి వరకు యాత్రకు విరామం ప్రకటించారు.తిరుమల వెంకన్నను చేరుకోంటుండటంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో మహా పాదయాత్రను కొనసాగించారు. గురువారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన రైతులు.. అక్కడి నుంచి తిరుమల వైపు యాత్రను ప్రారంభించారు. అంతకుముందు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్‌తోపాటు ఆయన భార్య, ఇతర అధికారులకు నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం జైజవాన్-జైకిసాన్ అంటూ నినదిస్తూ ముందుకు కదిలారు. ఇవాల్టి యాత్రలో పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.ఈరోజు మధ్యాహ్నం రైతుల మహాపాదయాత్రకు విరామం ప్రకటించనున్నారు. రేపు కూడా విరామం ప్రకటించే అవకాశముంది. తిరుపతిలో బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని రైతులు నిర్ణయించారు. హైకోర్టు తీర్పు కోసం పాదయాత్రను ఈ రోజు మధ్యాహ్నం నుంచి విరామం ప్రకటించారు. కోర్టు తీర్పును అనుసరించి ఎల్లుండి నుంచి తిరిగి యాత్ర కొనసాగనున్నది.