న్యూ ఢిల్లీ డిసెంబర్ 9
కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అయితే పూర్తి విరమణ కాదని, తాత్కాలికంగానే విరమించినట్లు సంయుక్త కిసాన్ మోర్చా నేత గురునామ్ సింగ్ చౌరానీ పేర్కొన్నారు. జనవరి 15న మరోసారి సమావేశమవుతామని తెలిపారు. ప్రస్తుతానికి ప్రభుత్వం తమకు కొన్ని హామీలను ఇచ్చిందని, అందుకే తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో మరోసారి ఉద్యమానికి సన్నద్ధమవడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.
ఇదే విషయాన్ని మరో రైతు నేత బల్వీర్ రాజేవాల్ కూడా నొక్కి చెప్పారు. ప్రస్తుతానికైతే ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ బార్డర్‌లోని టెంట్లను తొలగిస్తున్నామని, తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి సన్నద్ధమవుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. అయితే ఈ సింఘూ సరిహద్దు ప్రాంతాలను తాము శుక్రవారం సాయంత్రం నుంచి ఖాళీ చేయడం ప్రారంభిస్తామని తెలిపారు. ఇక 13 న స్వర్ణ దేవాలయానికి వెళ్తామని, 15 కల్లా పంజాబ్‌లోని రైతులు తమ ఉద్యమానికి తాత్కాలికంగా స్వస్తి పలుకుతారని రైతు అశోక్ ధావలే పేర్కొన్నారు.