విజయవాడ, డిసెంబర్ 10,
మూడు రాజధానుల బిల్లు రెడీ అవుతుంది. అధికారులు, న్యాయనిపుణలు ఇదే పనిలో ఉన్నారు. జగన్ ఈ మేరకు అధికారులను ఎప్పటికప్పుడు బిల్లుల పురోగతిపై అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. వచ్చే ఉగాదికి ముందే బిల్లులను ఆమోదించుకోవాలన్నది జగన్ ఆలోచన. అందుకే అధికారులను జగన్ పరుగులు పెట్టిస్తునట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ బిల్లు పురోగతిపై జగన్ స్వయంగా పాలో అప్ చేస్తున్నారంటున్నారు. రాజధానిని తరలించేందుకు.రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. వీటి స్థానంలో కొత్త బిల్లులు తెస్తామని కూడా జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. జగన్ కు కూడా ఇంక సమయం లేదు. మూడేళ్లు మాత్రమే ఎన్నికలకు టైం ఉండటంతో వీలయినంత త్వరగా బిల్లులు ఆమోదించుకుని రాజధానిని తరలించాలన్న నిర్ణయంతో జగన్ ఉన్నారు. అందకోసం నిత్యం అధికారులను పురోగతిపై ప్రశ్నిస్తున్నారు. ఈసారి బిల్లులు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు దాదాపు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని జగన్ పదే పదే అధికారులను, న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉగాదికి ముందే శాసనసభ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మూడు బిల్లులను ఆమోదించుకోనున్నారు. రెండు సభల్లో తగినంత బలం ఉండటంతో ఆర్డినెన్స్ కూడా సులువుగానే వస్తుంది. దీనివల్ల న్యాయస్థానాలు కూడా పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చన్న అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతుంది. ఉగాది నాటికి విశాఖకు సచివాలయాన్ని, సీఎం కార్యాలయాన్ని తరలించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈలోపు ఉద్యోగ సంఘాల సమస్యలను కూడా పరిష‌్కరించుకుని విశాఖ వెళ్లేందుకు జగన్ రెడీ అవుతున్నారు. ముహూర్తం ఉగాదికి పెట్టారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.