అనంతపురం, డిసెంబర్ 10,
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజుకున్న రాజకీయ సెగల్లో.. వేలు పెట్టారు తెలంగాణకు చెందిన మల్లాది వాసు. వనభోజనాల్లో మల్లాది వాసు చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చగా మారాయి. వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ చేశారు. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ రకరకాలుగా మలుపులు తిరుగుతోంది. వాసు చేసిన కామెంట్స్‌తో వచ్చిన సమస్య సమసిపోతుంది అని అనుకుంటున్న తరుణంలో అనంతపురం జిల్లాలో అలజడి మొదలైంది. మల్లాది వాసును కీర్తిస్తూ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయన పేరున యువసేనలు పుట్టుకొచ్చాయి. దీంతో వీటి వెనక ఎవరు ఉన్నారు? ఫ్లెక్సీలు కట్టి ఇస్తున్న సంకేతాలేంటి అనే ప్రశ్నలు జిల్లాలో చర్చగా మారాయి.అనంతపురంలోని బళ్లారి రోడ్డులో మాల్లాది వాసు అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు పుట్టుకొచ్చాయి. కొన్ని ఫ్లెక్సీలలో హిందూపురం, ధర్మవరం అభిమానులు.. ఇట్లు మల్లాది యువసేన అని ప్రింట్ చేశారు. ఆ ఫ్లెక్సీలలో మల్లాది వాసు ఫొటోతోపాటు మాజీ సీఎం ఎన్టీఆర్, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఇమేజ్‌లు పెట్టారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా తెలుస్తోంది. అవి కూడా రాత్రికి రాత్రి ఒకేసారి కట్టేశారు. ఎవరి కంట పడకుండా.. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు ప్లేస్‌లు ఎంచుకుని ఫ్లెక్సీలను వేళ్లాడదీశారు. సాధారణంగా ఫ్లెక్సీలలో ఏదో ఒక మూల ప్రింటింగ్ ప్రెస్ పేరు ఉంటుంది. మల్లాది వాసు పేరుతో వెలిసిన ఫ్లెక్సీలలో అది కూడా లేకుండా జాగ్రత్త పడటం.. అజ్ఞాత అభిమానుల జాగ్రత్తలకు అద్దం పడుతుంది.ఫ్లెక్సీలపై ఒకవైపు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతుంటే.. మరోవైపు పోలీసులు సైలెంట్‌గా జల్లెడ పడుతున్నారు. ఎవరీ పని చేశారు? వీటి వెనక ఉన్నదెవరు? అనేది కూపీ లాగుతున్నారట. టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే.. మాకేం సంబంధం అని ముఖంమీదే చెప్పేస్తున్నారట. ఈ సమస్య అటు ఇటు తిరిగి తమ మెడకు ఎక్కడు చుట్టుకుంటుందో అని ఆంతరంగిక సమావేశాల్లో ఆందోళన చెందుతున్నారట తెలుగు తమ్ముళ్లు.మల్లాది వాసు చేసిన కామెంట్స్‌ను టీడీపీ నేతలు ఖండించలేదు.. అలాగని మద్దతు ప్రకటించలేదు. అలాంటప్పుడు ఫ్లెక్సీలు కట్టింది ఎవరు? దీనిపై పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారట. మొత్తం మీద మల్లాది వాసు తెలంగాణలో చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లోకే కాదు.. జిల్లాలకు కూడా పాకాయి.